Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'సమ్మతమే'. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడారు.
ఎవరూ తీయలేదు
చాలా సింపుల్ అండ్ ఫ్రెష్ పాయింట్. ఇలాంటి పాయింట్‌ని ఎవరూ తీయలేదు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దాం. ప్రతి సీన్ చాలా వినోదాత్మకంగా ఉంటుంది. రెండున్నర గంటలపాటు ఒక ఫ్రెష్‌నెస్, బ్రీజీనెస్ ఉండేలా దర్శకుడు గోపీనాథ్ బాగా డిజైన్ చేశారు.
ఆడపిల్ల లేకపోతే..?
ఇంటికి మహాలక్ష్మీ ఆడపిల్ల. ఆ ఆడపిల్ల లేని ఇల్లు బోసిపోయి ఉంటుంది. ఇందులో హీరో పేరు కష్ణ. అతని తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. ఆ ఇంటికి మళ్ళీ ఆడపిల్ల వస్తే కళ వస్తుంది. అందుకే చిన్నప్పుడే 'నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావని' నాన్నని అడుగుతాడు. పెళ్లిపై అంత శుభసంకల్పం ఉన్న ఒక క్యారెక్టర్‌కి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ సినిమా. ముఖ్యంగా ఒక అమ్మాయి తాలూకు ఎమోషన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ప్రేమలో పడినపుడు, ఒక రిలేషన్ షిప్లో ఉన్నప్పుడు ఇలా ప్రతి ఎమోషన్ని కొత్తగా ప్రజెంట్ చేశాం. ఇక క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్‌లో చెప్పే పాయింట్‌కి అందరూ కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం.
సర్ప్రైజ్ కోసం చూపించలేదు
ఇందులో పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి. శేఖర్ చంద్ర గారు మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఏడు పాటలను అందరూ బాగా ఎంజారు చేస్తారు. సప్తగిరి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. చాలా మంది మంచి నటులు ఉన్నారు. సర్ప్రైజ్ కోసం వారిని ట్రైలర్లో చూపించలేదు. లిమిటెడ్ బడ్జెట్లో ఈ సినిమా చేయాలని అనుకున్నాం. తెలియకుండానే పెద్ద సినిమా అయ్యింది. 75 లైవ్ లోకేషన్స్‌లో సినిమా తీశాం. ఎక్కడా రాజీపడలేదు. ఆగస్ట్‌లో 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' రిలీజ్ ఉంటుంది. సెప్టెంబర్ చివరిలో 'వినరో భాగ్యం విష్ణు కథ' గీతా ఆర్ట్స్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ఉంది. ఈ ఏడాదిలోనే ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి. నేను ఏ సినిమా చేసినా, ఏ పాత్ర పోషించినా దేనికదే వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాను.