Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 'చోర్ బజార్' చిత్రంతో తెలుగు తెరపై మెరవనుంది నిన్నటితరం అగ్ర నాయిక, జాతీయ ఉత్తమ నటి అర్చన. ఆకాష్‌పురి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది.
ఈ సందర్భంగా అర్చన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'దక్కిన అవకాశాలు, చేసిన సినిమాలతో సంతప్తిగా ఉన్నాను. ఇప్పుడు మన సినిమాల్లో మహిళా పాత్రలకు 20 శాతం ప్రాధాన్యత ఉంటోంది. 'జార్జ్ రెడ్డి' సినిమా చూశాక దర్శకుడు జీవన్ రెడ్డి ఒక బోల్డ్ అటెంప్ట్ చేశాడని అనిపించింది. టెక్నికల్‌గా ఆ సినిమాను రూపొందించిన విధానం నన్ను ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం ఆయన నన్ను సంప్రదించినప్పుడు నేను ఎవరికి తల్లి, ఎవరికి వదిన, ఎవరికి అత్త అని అడిగాను. ఆయన నవ్వుతూ, మీరు ఎవరికీ ఏదీ కాదు. ఒక తల్లి, మీ పాత్రకు సొంత వ్యక్తిత్వం, మీకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పారు. ఆ మాటతో ఆలోచనలో పడ్డాను. ఒక లైన్లో చెప్పమంటే ఈ సినిమాలో మీరు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్, ఆయన్ని ప్రేమిస్తారు. ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోతారన్నాడు. ఇంకేమీ చెప్పకు చిత్రీకరణ ఎప్పుడని అడిగా. తమిళనాడులో ఎంజీఆర్ కోసం పెళ్లి చేసుకోని వారున్నారు. అలాగే అమితాబ్ కోసం ఒంటరిగా అలాగే ఉండిపోయినవారున్నారు. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్న పాత్ర అనిపించింది. హీరో పేరు బచ్చన్ సాబ్, మా ఇద్దరికీ అమితాబ్ అంటే ఇష్టం. ఇదొక ఎంటర్టైన్మెంట్, కమర్షియల్, కలర్ ఫుల్ ఫిల్మ్. అందుకే ఈ చిత్రంలో ఒక వైవిధ్యమైన పాత్రలో నటించాను. ఇదొక మాస్ ఫిలిం. నా జోనర్ దాటి బయటకొచ్చి నటించాను. తమిళం, కన్నడ, మాలయళ భాషల్లో పలు ఆర్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను' అని చెప్పారు.