Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె బాటలో సినీ కార్మికులు
సినీ కార్మికుల వేతనాలను 45 శాతం పెంచాలి. వేతనాన్ని పెంచుతున్నట్టు నిర్మాతలు రాత పూర్వకంగా హామీ ఇస్తేనే షూటింగ్స్‌కి హాజరవుతాం అని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. గత కొన్నేళ్ళుగా సినీ కార్మికుల వేతనాలను పెంచాలంటూ నిర్మాతలకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పట్టించుకోలేదు. వేతనాలను 45 శాతం పెంచాలంటూ ఈనెల 6వ తేదీన ఫిల్మ్‌ఛాంబర్‌కు, నిర్మాతల మండలికి ఫిల్మ్ ఫెడరేషన్ లేఖ రాసింది. వేతనాలు పెంచని పక్షంలో సమ్మెకు దిగుతామని కూడా ఆ లేఖలో పేర్కొంది. అయితే దీనిపై ఎవ్వరూ స్పందించకపోవడంతో బుధవారం జూబ్లీ హిల్స్ పరిధిలోని వెంకటగిరిలో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వివిధ యూనియన్స్‌కు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. నాలుగేళ్ళుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని, దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఈ విషయమై నిర్మాతల తరఫున సి.కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, 'కార్మికులకు వేతనాలు పెంచటానికి మాకెలాంటి ఇబ్బంది లేదు. నిర్మాతలందరూ షూటింగ్స్ కొనసాగించటానికి సిద్ధంగా ఉన్నారు. నేటి (గురువారం) నుంచి కార్మికులు షూటింగ్‌లకు ఎప్పటిలాగా వస్తేనే వేతనాలు, విధి విధానాలపై ఎల్లుండి (శుక్రవారం) ఓ కొలిక్కి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే.. మా నిర్మాతలెవ్వరూ షూటింగ్‌లు చేయటానికి సిద్ధంగా లేరు' అని చెప్పారు.
దీనికి ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ స్పందిస్తూ, 'మేం పాత వేతనాలతో షూటింగ్‌లకు వెళ్ళం. కొత్త జీతాలతోనే హాజరవుతాం. నిర్మాతలు హెచ్చరికలు చేసినట్లుగా మాట్లాడారు. వేతనాలు పెంచకపోతే మూకుమ్మడి ఆందోళనలు కొనసాగుతాయి. ఈరోజు (బుధవారం) 25 సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో 5 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. సినీ కార్మికులను అణగదొక్కేలా నిర్మాతల మండలి తీరు ఉంది. సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే నష్టపోయేది నిర్మాతలే. మంత్రి తలసాని చొరవతో చర్చలకు వెళ్తాం. ఈ విషయంలో సినీ పెద్దలు, ప్రభుత్వం మాకు అండగా ఉంటుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.
కరోనా వల్ల సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. సినిమాల షూటింగ్స్ లేకపోవడంతో ఉపాధి దొరక్క ఆర్ధిక కష్టాల్లో ఉన్నారు. తక్షణమే కార్మిక సంఘాలతో ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చలు జరిపి, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొనే వరకూ ఎదురు చూడొద్దు.
- సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్