Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా 'థ్యాంక్యూ'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఫేర్ వెల్..' అనే పాటను మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాగ చైతన్య, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు విక్రమ్ కె కుమార్, సంగీత దర్శకుడు థమన్, ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, 'ఇదొక బ్యూటిఫుల్ మూవీ. మన జీవితంలో చిన్నప్పటి నుంచి గొప్ప స్థాయికి చేరుకునే వరకు ఎంతోమందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాం. మనం ఎవరికి కతజ్ఞతగా ఉండాలో తెలుస్తుంది. ఈ సినిమా చూశాక మీరది అనూభూతి చెందుతారు. దర్శకుడు విక్రమ్‌కు చాలా పెద్ద మనసుంది. ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తారు. దిల్ రాజు గారి పేరులోనే దిల్ ఉంది. ఆయన సంస్థలో నేను మూడు సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాగచైతన్యలో నాగార్జున కనిపించారు. ఈ 'ఫేర్ వెల్' సాంగ్ సినిమాలో మంచి సందర్భంలో వస్తుంది. ఈ పాట చూశాక మీరు ఉద్వేగానికి గురవుతారు' అని చెప్పారు.
'నా డియర్ ఫ్రెండ్ నాగ చైతన్యతో మరోసారి సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజుకు థ్యాంక్స్. తమన్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. మీకు సినిమా తప్పకుండా నచ్చుతుంది' అని దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెలిపారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, 'ఐదో తరగతి వరకు అమ్మానాన్నతో ఉంటాం. ఆ తర్వాత స్కూల్ మేట్స్‌తో కలుస్తాం. ఆ తర్వాత కళాశాల జీవితమే. అంత అనుబంధమున్న ఈ కాలేజ్ లైఫ్‌ను వదిలేసి వెళ్తుంటే, ఎంత భావోద్వేగాలకు గురవుతామో ఈ 'ఫేర్ వెల్' పాట ద్వారా చెప్పాం. తమన్ సూపర్బ్ ట్యూన్ ఇచ్చాడు. దర్శకుడు విక్రమ్ గతంలో '24', 'ఇష్క్', 'మనం' లాంటి ఫీల్ గుడ్ సినిమాలు చేశాడు. ఈ సినిమా కూడా అలాంటి సోల్ ఫుల్ సినిమా. మీరు సినిమా చూశాక ఇదే అనుభూతి కలుగుతుంది. హీరో నాగ చైతన్య మీలాంటి కుర్రాడిలా ఉంటాడు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు, మూడు డిఫరెంట్ లుక్స్‌లో నాగచైతన్య కనిపిస్తాడు' అని అన్నారు.
'మనందరి జీవితాల్లో బెస్ట్ టైమ్ కాలేజ్ లైఫ్. ఆ తర్వాత అంతా ప్రపంచంతో పోటీ పడుతూ పరుగులు పెట్టాల్సిందే. మనం ఇక్కడ నేర్చుకున్న విషయాలే జీవితాంతం మనల్ని ముందుకు నడిపిస్తాయి. అందుకే ఈ కాలేజ్ లైఫ్‌ను బాగా ఎంజారు చేయండి. యూత్ సినిమాను ఎలా ఇష్టపడతారో అనేదే ఆలోచిస్తాం. రిలీజ్ రోజే థ్యాంక్యూ సినిమా చూడండి. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా మా సినిమా రిలీజ్ అవుతోంది' అని హీరో హీరో నాగ చైతన్య చెప్పారు.