Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన కథానాయకుడు ఆర్.మాధవన్ నటించిన తాజా చిత్రం 'రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్'. హీరోగా నటిస్తూనే ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ట్రై కలర్ ఫిలింస్, వర్గీస్ మూలన్ పిక్చర్స్, 27 ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై ఆర్.మాధవన్, సరితా మాధవన్, వర్గీస్ మూలన్, విజరు మూలన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ఆర్.మాధవన్ మాట్లాడుతూ, 'నేను 'విక్రమ్ వేద' సినిమా చేసిన తర్వాత ఇస్రో సైంటిస్ట్‌కి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన మాల్దీవులకు సంబంధించిన అమ్మాయితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మన దేశానికి చెందిన రాకెట్రీ సీక్రెట్స్‌ను పాకిస్తాన్‌కి అమ్మేశాడు. ఆ నేరం కింద ఆయన్ని అరెస్ట్ చేసి, చిత్ర హింసలు పెట్టారు. దాదాపు చంపినంత పని చేశారు. కానీ సీబీఐ చేసిన దర్యాప్తులో ఆయన నిరపరాధిగా నిరూపించబడ్డారు అనేదే కథ అన్నారు. నాకు చాలా బాగా నచ్చింది. పేదవాడి జేమ్స్ బాండ్ స్టోరీ అనిపించింది. 2016-2017లో త్రివేండ్రంలో నంబి సార్‌ను కలిశాను. ఆయన కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. కానీ బాధతో కనిపించాయి. జైలులో ఉన్న సింహంలా అనిపించారు. ఆయన ఇస్రో, నాసాలకు సంబంధించిన విషయాల గురించి చెబుతున్నప్పుడు జేమ్స్ బాండ్ బాబులాగా అనిపించాడు. ఆయన సాధించిన విజయాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ప్రపంచంలో ఏ సైంటిస్ట్ ఎదుర్కోని పరిస్థితులను నంబి నారాయణన్ ఫేస్ చేశారు. ఆయన గురించి ప్రపంచం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలకు మన దేశానికి చెందిన ఇంజనీర్స్ సి.ఇ.ఓలుగా పని చేస్తున్నారు. చాలా మంది ఇండియాలో లేరు. అలాంటి వారందరూ మన దేశానికి తిరిగి రావాలి. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి రాకెట్ ఇంజెన్ని చూపించబోతున్నందుకు గర్వంగా ఉంది' అని అన్నారు.