Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్ బయ్యాను హీరోగా పరిచయం చేస్తూ హై బడ్జెట్‌తో శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం 'అంతేనా..ఇంకేం కావాలి'. వెంకట నరసింహరాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఝాన్సీ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు సోమవారం రామానాయుడు స్టూడియోలో సినీ అతిరథుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.
హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మురళీ మోహన్ క్లాప్ కొట్టగా, దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచాన్ చేేశారు. స్క్రిప్ట్‌ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ అందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు వెంకట నరసింహ రాజ్ మాట్లాడుతూ, 'ఇది తల్లీ కొడుకుల సెంటిమెంట్ ఉన్న కథ. అమ్మకి ఇచ్చిన మాటను, అమ్మాయికి ఇచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకున్నాడు అనేదే ఈ చిత్రకథాంశం. నెక్స్ట్ మంత్ నుండి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్తున్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం' అని అన్నారు. 'దర్శకుడు వెంకట నరసింహ రాజ్ చెప్పిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. కామెడీ, లవ్, సెంటిమెంట్ వంటి అంశాలు ఉన్న కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని నిర్మాత రవీంద్ర బాబు తెలిపారు.
'ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని నాయకానాయికలు పవన్‌కళ్యాణ్, ఝాన్వీశర్మ చెప్పారు. ఘర్షణ శ్రీనివాస్, సునీల్, బ్రాహ్మజీ, సుమన్ (గెస్ట్ రోల్ ), బిత్తిరి సత్తి, సఫి, ఫిష్ వెంకట్, కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు, రంగస్థలం లక్ష్మి, ఈశ్వర్ రెడ్డి, భాను ప్రకాష్, లక్ష్మణ్ బాబు, గోపి, జబ్బర్దస్త్ రాము, జబర్దస్త్ ఆర్టిస్ట్స్, గబ్బర్ సింగ్ బ్యాచ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.