Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'అల్లూరి'. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. ఫిక్షనల్ బయోపిక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'నిజాయితీకి మారుపేరు' అనేది ఉపశీర్షిక. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తూ ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ,'సైనికులు, పోలీసులు, వైద్యులు.. ఈ ముగ్గురిని రియల్ హీరోస్గా చూస్తా. ఇలాంటి పాత్రలు వచ్చినపుడు చాలా నిజాయితీ ఉండి, నచ్చితేనే చేయాలని అనుకునేవాడిని. సరిగ్గా ఇదే సమయంలో నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ పాత్ర దొరికింది. ఈ పాత్ర చేసిన తర్వాత నేను ఎందుకు పోలీసు అవ్వలేదని అనుకున్నాను. నా కెరీర్ బెక్కెం వేణుగోపాల్ గారితోనే మొదలైయింది. ఆయనతోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నా. నేటి సమాజానికి కావాల్సిన సినిమా ఇది' అని చెప్పారు.
'టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. మేం నిర్మించిన చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. 'అల్లూరి' మాకు చాలా స్పెషల్ మూవీ. అన్ని కమర్షియల్ హంగులు ఉన్న గొప్ప సినిమాగా ఉండబోతుంది. ఒక గొప్ప సినిమా తీశాననే తృప్తిని ఇచ్చిన చిత్రమిది. శ్రీవిష్ణు అల్లూరిగా అందర్నీ మెప్పించడం ఖాయం' అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు.
దర్శకుడు ప్రదీప్ వర్మ మాట్లాడుతూ,'అల్లూరి ఒక నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్. ఈ సినిమాని చూసిన అందరికీ పోలీసులపై చాలా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది' అని చెప్పారు.