Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'వాంటెడ్ పండుగాడ్'. 'పట్టుకుంటే కోటి' ట్యాగ్ లైన్. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మించారు. ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈచిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ, 'చిన్న సినిమాలు ఆడటం కష్టమని అనుకుంటున్న తరుణంలో.. చిన్న సినిమాగా వస్తున్న పెద్ద నవ్వుల చిత్రమిది. ఈ స్క్రిప్ట్ వింటున్నప్పుడే అందరూ ఎంజారు చేశారు. ఎలా తీస్తున్నారా? అని ఓసారి మారెడుమిల్లికి వెళ్లి చూశాను. మూడు రోజులుందామని వెళ్లా కానీ పది రోజులుండిపోయాను. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. పాటలు కూడా అద్భుతంగా తెరకెక్కించారు' అని తెలిపారు. 'రాఘవేంద్రరావు గారితో కలిసి సినిమాను నిర్మించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. సినిమా బాగా వచ్చింది. థియేటర్లో ఈ సినిమాను చూస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది' అని నిర్మాత జోసెఫ్ అన్నారు. 'అన్ని వర్గాల ప్రేక్షకుల్ని బాగా నవ్వించే సినిమా ఇది' అని దర్శకుడు శ్రీధర్ సీపాన చెప్పారు.