Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.
ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా కథానాయకుడు రామ్ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
పోలీస్ కథ వద్దనుకున్నా
పోలీస్ కథ చేద్దామనుకున్నాను. నాలుగైదు కథలు విన్నాను. అనీ రొటీన్‌గా అనిపించాయి. పోలీస్ కథలు చేస్తే ఫ్రెష్‌నెస్ ఉండాలనేది నా ఫీలింగ్. రొటీన్ కథలు విని, వద్దని డిసైడ్ అయ్యాను. లింగుస్వామి కథ చెప్పడానికి వస్తానంటే సరేనన్నాను. అప్పుడు పోలీస్ కథ అని తెలియదు. కథ చెప్పే ముందే నాకు విషయం తెలిసింది.
అంతగా ఎగ్జైట్ చేసింది
ఫార్మాలిటీ కోసం వినేసి, ఆ తర్వాత వద్దని చెబుదామనుకుని వినడం మొదలుపెట్టా. కథంతా విన్న తర్వాత ఇటువంటి కథే చేయాలని డిసైడ్ అయ్యా. కథలోని సోల్, ఎమోషన్ నాకు బాగా నచ్చింది. 'మీరు ఎలా రాశారని అడిగితే... 'కొంత మంది రియల్ పోలీస్ ఆఫీసర్లను చూసి కథ రాశా' అని చెప్పారు. నిజంగా కొందరు పోలీసులు అలా ఉన్నారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. కథ చెప్పేటప్పుడు అందులో జెన్యూన్ ఎమోషన్ నాకు కనిపించింది. ఈ కథ నన్ను ఎంతగా ఎగ్జైట్ చేసిందంటే, ఆ సాయంత్రానికే ఓ పోలీస్ యూనిఫామ్ మా ఇంటికి తెప్పించా. నేను ఎప్పటి నుంచో తమిళంలో చేయాలనుకుంటున్నాను. తెలుగు, తమిళం రెండు వర్కవుట్ అయ్యే స్క్రిప్ట్ దొరికితే చేద్దామనుకున్నాను. లింగుస్వామి గారు చెప్పిన ఈ స్క్రిప్ట్ కుదిరింది. చెన్నైలో పెరగటం వల్ల తమిళ వర్షెన్‌కి నేనే డబ్బింగ్ చెప్పాను.
ఆ లెక్కలు వేసుకోలేదు
'ఇస్మార్ట్ శంకర్' వంటి పెద్ద హిట్ తర్వాత సక్సెస్ లేని లింగుస్వామితో సినిమా చేయడానికి కారణం ఏంటని చాలా మంది అడిగారు. హిట్, ఫ్లాప్‌ల లెక్కలు వేసుకుంటే 'ఇస్మార్ట్ శంకర్' కూడా చేసేవాడిని కాదు. పూరి జగన్నాథ్, లింగుస్వామి గారు ట్రెండ్ సెట్టర్స్. ఈ స్క్రిప్ట్ లింగుస్వామి సినిమాగా మారితే ఎలా ఉంటుందో నేను చూశా. నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. వీళ్ళందరూ డైమండ్స్ లాంటి వాళ్ళు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కొంచెం దుమ్ము పడుతుంది. తుడిస్తే మళ్లీ డైమండ్ ధగధగలాడిపోతుంది (నవ్వుతూ). వీళ్లూ అంతే. ఇందులో ఆది పినిశెట్టి చేసిన గురు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సినిమాకి ఆ రోల్ చాలా ఇంపార్టెంట్.
దేవిశ్రీ మళ్ళీ మ్యాజిక్ చేశాడు
మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ చాలా కేర్ తీసుకున్నారు. దేవితో నాకు ఏడో సినిమా ఇది. లింగుస్వామి గారు స్క్రిప్ట్ చెప్పి వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేసి... రీ రికార్డింగ్ గురించి, సీక్వెన్సుల గురించి మాట్లాడాడు. అంత ఎగ్జైట్ అయ్యాడు. ఇలా అంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు. పాటలు కూడా కార్ స్పీకర్లో సాంగ్స్ వినడం వేరు. ఇంట్లో వినడం వేరు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడం వేరు. థియేటర్లో వేరు. ఒక్కో స్పీకర్లో సాంగ్ ఎలా రావాలి? అని ఆలోచించి డిజైన్ చేశాడు. తమిళంలో శింబు 'లూసు పెన్నే' అని ఒక పాట పాడారు. 'బుల్లెట్...' పాటకు శింబు అయితే బావుంటుందని చెప్పగానే నాకు ఆ వాయిస్ గుర్తు వచ్చింది. తెలుగులో 80 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. తమిళంలో 70 మిలియన్ ప్లస్ వచ్చాయి. తమిళంలో అంత రీచ్ రావడానికి శింబు ఒక కారణం. సాంగ్స్ మాత్రమే కాదు. కంప్లీట్ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేశాం. ఎమోషన్స్, సాంగ్స్, పెర్ఫార్మన్స్... కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీ ఇది.
బోయపాటితో పాన్ ఇండియా సినిమా
మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరిగారితో పని చేయటం చాలా హ్యాపీ. ఆయన ఎక్కడా ఏమీ మాట్లాడరు. చాలా సైలెంట్. బోయపాటి శ్రీనుగారి దర్శకత్వంలో నేను చేయబోయే సినిమాకు ఆయనే నిర్మాత కావడం ఆనందంగా ఉంది. ఇది పాన్ ఇండియా సినిమా. నా సినిమాలను హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే బోయపాటిగారి సినిమాలను కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక హీరోను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన సినిమా చేస్తారు. అందుకని, భారం అంతా ఆయన మీద వేశా (నవ్వుతూ). బోయపాటి శ్రీను తర్వాత హరీష్ శంకర్తోనా లేక అనిల్ రావిపూడితో సినిమా అనేది త్వరలోనే చెబుతాను.