Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కిన చిత్రం ''శభాష్ మిథు''. ఈ సినిమాలో మిథాలీ రాజ్ పాత్రను తాప్సీ పన్ను పోషించారు. అంతర్జాతీయ క్రికెట్లో 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డు బద్దలు కొట్టిన మిథాలీ రాజ్, వన్డేల్లో 10000 పరుగులకు పైగా చేశారు. ఈ చిత్రంలో ఆమె లెజెండరీ క్రికెటర్గా మారే ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ సినిమా గురించి తాప్సీ మాట్లాడుతూ, 'ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అందర్నీ ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంది. ఓ మహిళా క్రికెటర్గా మిథాలి రాజ్ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. మిథాలిగా నేను నటించడం చాలా గర్వంగా ఉంది. ఓ గొప్ప సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది' అని తెలిపారు.
మహిళా క్రికెట్ కెప్టెన్ మిధాలి రాజ్ మాట్లాడుతూ, 'నా గురించి సినిమా వస్తుందని అసలు ఊహించలేదు. ఏ రంగంలోనైనా మహిళలు అనుకున్నది సాధించగలరని మాత్రం ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది' అని అన్నారు.
భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ ఈ చిత్ర ట్రైలర్ను లాంచ్ చేసారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల15న విడుదలకానుందని మేకర్స్ అన్నారు.