Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ ఉత్తమ చిత్రం సురారై పొట్రు
- 68వ జాతీయ చలన చిత్ర అవార్డు
నాలుగు అవార్డులను కైవసం చేసుకుని 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటింది. జ్యూరీ అధ్యక్షుడు విపుల్‌షా ఆధ్వర్యంలో శుక్రవారం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను న్యూఢిల్లీలో ప్రకటించారు. ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా 'కలర్‌ఫొటో', ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ (అల వైకుంఠపురములో), ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ మేకప్ విభాగాల్లో 'నాట్యం' చిత్రానికి సంధ్యారాజు, టి.వి.రాంబాబు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈసారి తమిళ చిత్రం 'సురారై పొట్రు' ఏకంగా ఐదు అవార్డులను దక్కించుకుని విజయకేతనాన్ని ఎగురవేసింది. అలాగే మరో తమిళ చిత్రం 'శివరంజనీయం ఇన్నుమ్ సిలా పెంగళం'నికి ఉత్తమ ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్), ఉత్తమ సహాయనటి (లక్ష్మీ ప్రియ చంద్రమౌళి) విభాగాల్లో రెండు అవార్డులు లభించాయి. దీంతో ఏడు జాతీయ అవార్డులతో కోలీవుడ్ హాట్ టాపిక్‌గా నిలిచింది. పేదవాళ్ళు సైతం విమానంలో ప్రయాణించాలని కలలు కన్న ఎయిర్ దక్కన్ అధినేత జి.ఆర్.గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'సురారై పొట్రు'. సుధా కొంగర దర్శకత్వం వహించారు. సూర్య, అపర్ణా బాల మురళీ నాయకానాయికలుగా నటించారు. వీళ్ళిద్దరూ జాతీయ ఉత్తమ నటీనటులుగా ఎంపికవ్వడం ఓ విశేషమైతే, ఇదే చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లోనూ అవార్డులను పొండటం మరో విశేషం.
ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడిగా అజరుదేవగన్ (తానాజీ) ఎంపికయ్యారు. ఇక ఆరు అవార్డులను దక్కించుకుని మలయాళ సినిమా మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. 'అయ్యప్పనుమ్ కోషియమ్' మలయాళ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఫైట్స్, ఉత్తమ నేపథ్యగాయని, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో, ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో 'మాలిక్' (విష్ణు గోవింద్, శ్రీ శంకర్), ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ (కప్పెలా - అనీష్ నదోడి) విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కగా, హిందీ, మరాఠీ, కన్నడ సినిమాలు సైతం పలు అవార్డులను సొంతం చేసుకున్నాయి.
68వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతల వివరాలు
ఉత్తమ చిత్రం : సురారైపొట్రు (సుధాకొంగర)
ఉత్తమ నటుడు : సూర్య ( సురారైపొట్రు), అజరు దేవగన్ (తానాజీ)
ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి ( సురారైపొట్రు)
ఉత్తమ దర్శకుడు : కె. ఆర్. సచ్చిదానందన్
(అయ్యప్పనుమ్ కోషియమ్)
ఉత్తమ సహాయనటుడు : బిజూమీనన్ (అయ్యప్పనుమ్ కోషియమ్ )
ఉత్తమ సహాయ నటి : లక్ష్మీ ప్రియా చంద్రమౌళి
(శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్ - తమిళం)
ఉత్తమ బాల నటుడు : వరున్ బుద్దదేవ్ (తులసీదాస్ జూనియర్)
ఉత్తమ నేపథ్యం సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్ ( సురారైపొట్రు)
ఉత్తమ తెలుగు చిత్రం : కలర్‌ఫోటో
ఉత్తమ సంగీత దర్శకుడు : తమన్
(అల వైకుంఠపురములో - తెలుగు)
బెస్ట్ కొరియోగ్రఫీ : సంధ్య రాజు (నాట్యం- తెలుగు)
బెస్ట్ మేకప్ : టి.వి.రాంబాబు (నాట్యం - తెలుగు)
బెస్ట్ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
(శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్ - తమిళం)
బెస్ట్ స్క్రీన్‌ప్లే : షాలిని ఉషా నయ్యర్, సుధా కొంగర (సురారైపొట్రు)
బెస్ట్ డైలాగ్స్ : మడోన్నే అశ్విన్ (మండేలా - తమిళం)
బెస్ట్ సినిమాటోగ్రఫీ : సుప్రతిమ్ భోల్ (అవిజాత్రిక్ - బెంగాలీ)
ఉత్తమ నేపథ్య గాయని : నన్చ్చమ్మ (అయ్యప్పనుమ్ కోషియమ్)
ఉత్తమ నేపథ్యగాయకుడు : రాహుల్ దేవ్‌పాండే (మి వసంతరావు)
బెెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : నచికేట్ బర్వే, మహేష్ షేర్లా (తానాజీ)
బెస్ట్ లిరిక్ : సైనా (మనోజ్ మౌతషిర్ - హిందీ)
బెస్ట్ స్టంట్స్ : అయ్యప్పనుమ్ కోషియమ్ (మలయాళం)
(రాజశేఖర్, మాఫియా శశి, సుప్రీం సుందర్)