Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'.
హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ మీడియాతో ముచ్చటించారు.
చాలా మంచి సినిమా తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఎప్పటినుంచో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. 'సీతారామం'తో ఆ కోరిక తీరింది. బాలచందర్‌గారి 'మరో చరిత్ర', మణిరత్నంగారి 'గీతాంజలి' చరిత్రలో నిలిచిపోయాయి. 'సీతారామం' కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది.
సీతారామంలో పాటలు అద్భుతంగా రావాడానికి కారణం సంగీతం పట్ల నాకున్న అభిరుచి కూడా. నిజానికి నాకు సరిగమలు కూడా రావు. కానీ మంచి ట్యూన్‌ని పట్టుకొనే అభిరుచి దేవుడు ఇచ్చాడని భావిస్తాను. 'మీరు ఎదురుగా ఉంటే సంగీత సరస్వతి చక్కగా పలుకుతుందండీ' అని మహదేవన్ గారు అన్నారు. సరిగ్గా అదే మాట ఇళయరాజా గారు కూడా అన్నారు. అలాగే మణిశర్మ, కీరవాణితో కూడా సంగీతం పరంగా మంచి అనుబంధం ఉంది. సీతారామంకు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విశాల్‌ని తీసుకోవాలనేది హను ఛాయిస్. నేనూ విశాల్ మ్యూజిక్ విన్నాను. విశాల్ గారి భార్య కూడా సంప్రదాయ సంగీత గాయని. ఆమె సహకారం కూడా ఎక్కువ ఉంటుందనిపించింది. వారిద్దరూ చాలా కష్టపడ్డారు. నేపథ్య సంగీతం కూడా చాలా గ్రాండ్‌గా చేశారు. ఇప్పటికే పాటలు సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తించాయి.
హను రాఘవపూడి చాలా మంచి టెక్నిక్ తెలిసిన దర్శకుడు. చాలా గొప్ప కథ చెప్పాడు. సినిమాని ఒక విజువల్ వండర్లా తీశారు. కాశ్మీర్‌తో పాటు మిగతా చాలా అందమైన లొకేషన్స్ ఇందులో విజువల్ ఫీస్ట్‌గా ఉంటాయి. 'మహానటి'లో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని అద్భుతంగా చేేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్‌తో తీద్దాం' అని స్వప్నతో అప్పుడే చెప్పాను. హను ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా నేరుగా దుల్కర్‌కి చెప్పమని చెప్పాను. ఎందుకంటే నేషనల్ వైడ్‌గా రీచ్ ఉండే ఈ ప్రేమ కథకు దుల్కర్ అయితే సరైన న్యాయం చేయగలడనిపించింది.
ప్రభాస్‌తో చేస్తున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రీకరణ జనవరికి పూర్తవుతుంది. దీంతోపాటు నాగచైతన్య సినిమా, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్‌తో ఒక సినిమా చర్చల్లో ఉన్నాయి. 'అన్నీ మంచి శకునములే' చిత్రాన్ని అక్టోబర్ 5న రిలీజ్ చేస్తాం.