Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'బింబిసార'. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ అనేది క్యాప్షన్. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 5న ఈ సినిమా గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ట ఈ సినిమా గురించి పలు విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.
2018లో 'బింబిసార' జర్నీ ప్రారంభమైంది. సాధారణంగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఏదో కాలంలోకి వెళ్లినట్లు చూపించారు. కానీ ఇదే కాలానికి చెందిన ఓ రాజు మరో పీరియడ్‌లోకి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచే 'బింబిసార' కథ పుట్టింది.
కథంతా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత కళ్యాణ్‌గారికి 'మిమ్మల్ని ఓసారి కలవాలని అనుకుంటున్నాను' అంటూ మెసేజ్ పంపాను. 'పటాస్' సినిమా నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. మెసేజ్ చూసి ఆయన పిలిచారు. నేను చెప్పిన పాయింట్ బాగా నచ్చేసింది. రెండు, మూడు రోజుల్లో కలుద్దామని అన్నారు. అప్పుడు నిర్మాత హరిగారికి కథ నెరేట్ చేశాను. ఆయనకీ నచ్చింది.
తొలి సినిమాను డైరెక్ట్ చేశానంటే నా సబ్జెక్ట్‌పై నాకు ఉన్న నమ్మకం. దాన్నే కళ్యాణ్‌రామ్, హరిగారు నమ్మారు. 'బింబిసార' వంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటానికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాను. నాకు టీమ్ కూడా బాగా సపోర్ట్ చేసింది. కెమెరామెన్ ఛోటాగారు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్‌గారు, ఫైట్ మాస్టర్ ఇలా అందరి సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాను.
మన దేశాన్ని పాలించిన మన రాజులు ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు బింబిసారుడు గురించి తెలిసింది. ఆ పేరు కూడా స్ట్రైకింగ్‌గా అనిపించింది. ఆయన 500 సంవత్సరాలకు ముందు పరిపాలించిన రాజు. ఆయనకు సంబంధించిన వివరాలేవీ తెలియదు. అయితే నేను కొత్తగా నేర్చుకుంటూ, దాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాను. ఓ రకంగా చెప్పాలంటే నాకు ప్రతిరోజూ టైమ్ ట్రావెల్ చేసినట్లు అనిపించేది. బింబిసారుడుకి సంబంధించి త్రిగర్తల అనే సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాం. ఇది పూర్తిగా కల్పిత కథ. అందర్నీ కచ్చితంగా మెప్పిస్తుంది.
సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది హీరోలు రాజుల పాత్రల్లో మనల్ని అలరించారు. వారికి దగ్గర పోలికల్లో మన సినిమాలో హీరో లుక్ ఉండకూడదని అనిపించింది. ఆ సమయంలో మా డిజైనర్ రాము కొన్ని స్కెచ్చెస్ ఇచ్చారు. అందులో ఇప్పటి లుక్ అందరికీ నచ్చింది. గత ఏడాది సెప్టెంబర్‌కే చిత్రీకరణ పూర్తయ్యింది. అయితే సినిమాలో సీజీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. దీంతో సినిమా విడుదలకు ఎక్కువ సమయం పట్టింది.
ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చూపించబోతున్నాం. ఇందులో పాత్రలన్నీంటికీ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అన్నింటినీ ఓ సినిమాలోనే చూపించలేం. నెక్ట్స్ 'బింబిసారుడు 2' ఉంటుంది. బింబిసారుడు అనే క్యారెక్టర్ ఓ సూపర్ మ్యాన్‌లాంటి క్యారెక్టర్ దీన్ని 3, 4 భాగాలుగా కూడా చూపించవచ్చు (నవ్వుతూ). నాకు ముందు నుంచి డైరెక్షన్ అంటేనే ఇష్టం. అయితే మధ్యలో 'ప్రేమ లేఖ రాశా' అనే సినిమాలో హీరోగా నటించాను. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. దాంతో మళ్లీ దర్శకత్వ శాఖ వైపు అడుగులేశాను. ఇకపై మంచి కథలతో సినిమాలకు దర్శకత్వం వహిస్తాను.