Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మకంగా చిత్రం 'సీతారామం'. రష్మిక మందన కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మంగళవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
స్క్రీన్‌ప్లేని ఊహించలేరు
ఈ కథ నాకు నచ్చటానికి కారణం..ఇదొక ఒరిజినల్ స్క్రిప్ట్. ఈమధ్య కాలంలో ఇలాంటి కథలను రాయటానికి ఎవ్వరూ సాహసించడం లేదు. ఈ కథలో నాకు కంటెంట్‌తోపాటు పీరియాడిక్ టచ్ బాగా నచ్చింది. అలాగే స్క్రీన్‌ప్లేని కూడా ఎవ్వరూ ఊహించలేదు. ట్రైలర్లో మీరు చూసింది కేవలం కొంత మాత్రమే. అసలు కథేంటో వెండితెరపై చూస్తే థ్రిల్ అవుతారు.
అనాథ ఆర్మీ ఆఫీసర్..
ఇందులో నేనొక అనాథ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించాను. చాలా జోవియల్‌గా ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటాను. అయితే డ్యూటీలోకి వెళ్తే మాత్రం దేశభక్తి పూర్వకంగా ఉంటాను. అయితే కథలో జరిగే మలుపులను ఎలా ఊహించలేరో నా పాత్ర తీరు తెన్నులను కూడా ఊహించటం కష్టం. అంత చక్కగా దర్శకుడు హనుగారు నాపాత్రను డిజైన్ చేశారు. ఇప్పటివరకు ఎన్నో ప్రేమకథల్లో నటించా. అయితే ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమకథలో నటించటం తొలిసారి. అయితే ఇది ముక్కోణ ప్రేమకథా కాదా అనేది చెప్పలేను. ఇదొక అద్భుతమైన దృశ్య కావ్యం. ఇందులో సీతగా మృణాల్ ఠాకూర్ చక్కగా నటించింది. అశ్వినీదత్‌గారి బ్యానర్లో చేయటం అదృష్టంగా భావిస్తున్నాను.
సంగీతం.. అత్యద్భుతం
ఈ సినిమాలో సంగీతం అత్యద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నా పాటలు నాకెంతగా నచ్చాయంటే పబ్లిక్‌లో ఈ పాటలను నేను కూడా పాడుతున్నాను (నవ్వుతూ). పాటలను చిత్రీకరించిన విధానం, రాసిన విధానం, వీటికి సంగీతం చేసిన విధానం అన్నీ అత్యద్భుతంగా ఉంటాయి. విశాల్‌శేఖర్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు.
వాస్తవానికి దగ్గరగా..
నా సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అలాగే కమర్షియల్గానూ ఉంటాయి. ఇకపై కూడా నాదైన శైలిలో పాత్రలను, సినిమాలను ఎంపిక చేసుకుని, ప్రేక్షకులను ఎప్పటిలాగే అలరించే ప్రయత్నం చేస్తా.