Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కార్తికేయ 2'. 'కార్తికేయ'కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ, 'మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పగలను. మేం విడుదల చేసిన ట్రైలర్1 కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరి నుండి కూడా మంచి అప్రిసియేషన్స్ వస్తున్నాయి. మీ సినిమా ఎలా ఉన్నా థియేటర్‌కు వచ్చి చూస్తాం అని కామెంట్స్ పెట్టారు. మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. థియేటర్ ద్వారా ప్రేక్షకులకు గ్రాండ్‌గా బిగ్ స్క్రీన్ పై మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని తీసిన సినిమా ఇది. అందరూ థియేటర్స్ కు వచ్చి చూడండి. తప్పకుండా మీకు ఒక కొత్త అనుభూతిని పొందుతారు. టీజర్, ట్రైలర్ బాగుంటేనే ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారు. శనివారం (నేడు) ట్రైలర్2ను రిలీజ్ చేస్తున్నాం' అని చెప్పారు.
'మంచి కాన్సెప్ట్‌తో, మంచి విజువల్స్‌తో వస్తున్న ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సహకరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది. ఈనెల 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని నిర్మాత. టి. జి. విశ్వ ప్రసాద్ అన్నారు. మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, 'శ్రీకష్ణుడిని మోటీవ్గా తీసుకుని, ఈ సినిమా తీశాం, ఈ సినిమా ద్వారా టి.జి.విశ్వ ప్రసాద్‌తో అసోసియేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు చందు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు' అని తెలిపారు. దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ, 'మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాకు మీడియా, ప్రేక్షకుల ప్రోత్సాహాం ఉండాలి. మా 'కార్తికేయ 2' ప్రేక్షకులందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'కార్తికేయ' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలకు దీటుగా మా సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది' అని అన్నారు. 'ఈ సినిమా చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు చూసేలా ఉంటుంది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. సహ నిర్మాత వివేక్ మాట్లాడుతూ,'ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్‌కు వచ్చి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని అన్నారు. అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: కాలభైరవ, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్.