Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సీతారామం', 'బింబిసార' చిత్రాలపై అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ రెండు సినిమాలు విశేష ప్రేక్షకాదరణతో హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. 'బింబిసార' మాస్ కమర్షియల్ అంశాలతో మెప్పిస్తుంటే, 'సీతారామం' స్వచ్ఛమైన ప్రేమకథతో, ప్రేక్షకుల హదయాలను కొల్లగొడుతోంది. కరోనా కారణంగా, అలాగే పెంచిన టికెట్ ధరల నేపథ్యంలో ప్రేక్షకుల థియేటర్లకు రావడంలేదనే మేకర్స్ బాధపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కూడా ఈ రెండు సినిమాలకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో రావడం పరిశ్రమకి కొత్త ఊపిరినిచ్చినట్టుయ్యింది.
ఈ నేపథ్యంలో చిరంజీవి స్పందిస్తూ, 'ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండిస్టీకి ఎంతో ఊరటని, మరింత ప్రోత్సాహాన్నిస్తూ.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ, లేటెస్ట్గా విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా ఈ రెండు చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు హృదక పూర్వక శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.
పరిశ్రమకు ఆక్సిజన్ అందించాయి
'బింబిసార', 'సీతారామమ్' చిత్రాలు ప్రేక్షకుల ఆదరణతో బ్రహ్మాండమైన విజయాన్ని పొందగలిగాయి. ప్రేక్షకులు తరలి రావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొని ఉంది.ఇప్పుడు సినిమా పరిశ్రమ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు 'ఆక్సిజన్' అందించినట్టుగా అందరు భావిస్తున్నారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరపున ఈ రెండు చిత్ర నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, ఇంత ఘనవిజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం' అని గౌరవ కార్యదర్శులు టి.ప్రసన్న కుమార్ , మోహన్ వడ్లపట్ల ఓ ప్రకటనలో తెలిపారు.