Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'లైగర్' (సాలా క్రాస్‌బ్రీడ్) ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ వెండితెరకు పరిచయం అవుతున్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, 'యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు పెద్ద కలలు ఉండేవి. 'పెళ్లి చూపులు' సినిమాతో నా ప్రయాణం చిన్నగా మొదలైంది. ఆ చిత్రానికి ప్రేక్షకులు చాలా పెద్ద విజయాన్ని ఇచ్చారు. అప్పటి నుండి ప్రేమ పంచుతూనే ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఇండియా మొత్తానికి ఒక కథ చెప్పాలని కలగన్నాం. అది 'లైగర్'తో చేస్తున్నాం. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా నాకు పెద్ద ఎత్తున ప్రేమ లభించింది. కానీ ఎప్పుడూ మర్చిపోలేని ప్రేమ ఇక్కడి నుండే మొదలైంది. 'పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి' సమయంలో ఇక్కడ కాలేజీల్లో తిరుగుతుంటే మన పిల్లలు ఇచ్చిన ప్రేమ మర్చిపోలేను. ఇదంతా మన థియేటర్లలోనే మొదలైంది. 'లైగర్' పై మేం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇండియా షేక్ అవుతుంది. ఈనెల 25 మీ అందరికీ నచ్చే సినిమా, మీరంతా పూర్తిగా ఎంజాయ్ చేసే సినిమా ఇస్తాం' అని చెప్పారు. 'దేశ వ్యాప్తంగా మాకు గొప్ప ప్రేమ లభించింది. హైదరాబాద్‌లో తెలుగు ప్రేక్షకులు పంచిన ప్రేమ మర్చిపోలేనిది. 'లైగర్' నా మొదటి తెలుగు సినిమా. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని నాయిక అనన్య పాండే అన్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నాయకానాయికలు విజయ్ దేవరకొండ, అనన్య పాండే సమాధానాలు ఇచ్చారు.
ఈ సినిమాని తెలుగు నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీగా చూడాలా?, బాలీవుడ్ నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీగా చూడాలా?
విజయ్ దేవరకొండ : లైగర్ పక్కా తెలుగు సినిమా. అయితే హిందీలా కనిపిస్తుందనే చర్చ మన తెలుగు ఆడియన్స్‌లో ఉంది. దాన్ని నేను అర్ధం చేసుకుంటా. ఇందులో పాటలు చేసింది హిందీ కంపోజర్స్. షూట్ చేసినపుడు అప్పుడు ఉన్నది హిందీ వెర్షనే. పాటలు హిందీలో చేశాం. సినిమా మాత్రం పక్కా తెలుగు. సినిమా చూసినప్పుడు పూర్తిగా తెలుగు సినిమా అని ఫీలౌతారు. లైగర్ మన సినిమా. మన సినిమాని ఇండియాకి చూపిస్తున్నాం.
ఒక్కసారిగా దేశాన్ని షేక్ చేసే సినిమా చేయడానికి ఉన్న కారణం ఏంటి?
విజయ్ దేవరకొండ: కెరీర్ మొదలుపెట్టినప్పుడు నేను ఏదైనా చేయగలననే కాన్ఫిడెన్స్ ఉండేది. అయితే కొంత కాలం తర్వాత నాకో సంగతి అర్థమైంది. పైన ఏదో చేయి ఉంది. ఆశీర్వాదం ఉంది. అది నడిపిస్తుంది. దాని గురించి తగినంత పని చేయాలి. ఇప్పుడు వస్తున్న ప్రేమకు వారిని సంతోష పెట్టే పని చేయాలి. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు పంచిన ప్రేమను 'లైగర్' తిరిగిస్తుందని నమ్ముతున్నాను.
లైగర్‌తో తెలుగులో రావడం ఎలా అనిపించింది ?
అనన్య పాండే : సౌత్ సినిమాలు అంటే ఇష్టం. పూరి, ఛార్మీ గారు లైగర్ కథ చెప్పినపుడు చాలా ఎగ్జైంటింగ్‌గా అనిపించింది. లైగర్ లాంటి లార్జర్ దేన్ లైఫ్ సినిమాతో సౌత్‌లోకి రావడం ఆనందంగా ఉంది. ఆన్ స్క్రీన్‌లో చూసినప్పుడు విజరు చాలా సైలెంట్ అనుకున్నాను. కానీ ఆయనతో పని చేసిన తర్వాత తెలిసింది. విజయ్ నేను అనుకున్నంత సైలెంట్ కాదు. అలాగే ఇందులో మానాన్నగారితో నటించాను. ఆయనతో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మా నాన్న గారు కూడా కీలక పాత్ర చేశారు. ఆయన ఎప్పుడూ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయమని చెబుతుండేవారు. ఆయనతో నటించడంతో ఆ కోరికా తీరింది.