Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సస్పెన్స్ థ్రిల్లర్ 'శుక్ర' చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సుకు పూర్వాజ్. ఆయన ద్వితీయ ప్రయత్నంగా రూపొందించిన సినిమా 'మాటరాని మౌనమిది'. రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ బ్యానర్స్ నిర్మించాయి. మహేష్ దత్త, శ్రీహరి ఉదయగిరి, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటించారు. లవ్ స్టొరీ, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు సుకు పూర్వాజ్ మీడియాతో షేర్ చేసుకున్నారు.
చూసిన వాళ్లంతా బాగుందన్నారు
'నా తొలి సినిమా 'శుక్ర' షూటింగ్లో ఉండగానే ఆ సినిమా మేకింగ్, రషెస్ చూసి ఈ ప్రాజెక్ట్ నిర్మించేందుకు నిర్మాతలు ముందుకొచ్చారు. 'శుక్ర' విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాం. మనం సాధారణంగా సినిమాకు వెళ్తే దానిలో ఫిక్షన్, థ్రిల్లర్, హర్రర్.. ఇలా ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఈ చిత్రంలో అలాంటి అంశాలన్నింటిని కలిపి మల్టీ జోనర్ మూవీగా చేశాం. ఇందులో రెండు హాంటెట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. నవ్వించే ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పటికే కొన్ని ప్రివ్యూ షోస్ వేశాం. చూసిన వాళ్లంతా చాలా బాగుందన్నారు. మాకూ సినిమా మీద మంచి నమ్మకం ఉంది.
ఆ విషయంలో రవిబాబు స్ఫూర్తి
మల్టీజోనర్ తరహా మేకింగ్‌లో నాకు అనుభవం ఉంది. గతంలో షార్ట్ ఫిలింస్ చేశాం. అవి బాంబే, న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమయ్యాయి. ఒక జోనర్ చిత్రాలతో మెప్పించడం కష్టం. క్యారెక్టర్స్ సరిగ్గా రాలేదనో, ల్యాగ్ ఉందనో పది నిమిషాల్లో సినిమాను తేల్చేస్తారు. కానీ ఇలాంటి సినిమాల్లో జోనర్స్ మారుతుంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ కొనసాగుతూ ఉంటుంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే పోస్టర్స్ డిజైన్ దగ్గర నుంచి కొత్తగా ఉండేలా చూసుకున్నాం. కొత్త హీరో, హీరోయిన్లతో పోస్టర్ చేస్తే మిగతా వాటిలాగే అనుకుంటారు. ఈ విషయంలో నాకు దర్శకుడు రవిబాబు స్ఫూర్తి. ఆయన కుక్క పిల్లలతో, ఏనుగులతో పోస్టర్స్ చేశారు.
శాస్త్రీయ అంశంతో ముడిపడిన ఆరు మలుపులు..
మహిళ అంటే మనకు భరతమాత దగ్గర నుంచి దేవతలందరూ గుర్తొస్తారు. వాళ్లంటే మనకో ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే భావోద్వేగంగా సాగుతుంది. ఆమె పాత్ర 1986 కాలం, ప్రస్తుత కాలంలో ఉంటుంది. ప్లాష్ బ్యాక్‌లో మాటలు రావు, ప్రెజంట్లో వస్తాయి. కథలో ఐదారు మలుపులు ఉంటాయి. ఇవన్నీ ఒక శాస్త్రీయ అంశంతో ముడిపడి ఉంటాయి. నాయిక పాత్రలో సోనీ శ్రీవాస్తవ మెప్పిస్తుంది. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ఆకర్షణ అవుతుంది. చందూ అనే ఫిల్మ్ జర్నలిస్ట్‌ను ఈ సినిమాలో ఒక కీ రోల్‌కు తీసుకున్నాం. అతను సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాడు. అతని పాత్ర నవ్వించేలా సాగుతుంది. రెండు మూడు బ్యానర్స్‌తో నా తదుపరి చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.