Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిచరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఐక్యూ'. కె ఎల్ పి మూవీస్ పతాకంపై కాయగూరల రాజేశ్వరి సమర్పణలో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, దసరాకి విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా మీడియాతో దర్శకుడు జిఎల్బి శ్రీనివాస్ మాట్లాడుతూ,'ఈ నెల 25తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఒక ఐటెమ్ సాంగ్ సత్యప్రాకాశ్ గారి మీద చేస్తున్నాం. ఇప్పటికే చిత్రీకరించిన రెండు పాటలు చాలా బాగా వచ్చాయి. వరికుప్పల యాదగిరి, నాగేంద్రప్రసాద్ ఒక పాట రాస్తున్నారు. అవి కూడా చాలా బాగా వచ్చాయి. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ సినిమాకి చాలా బాగా హైలెట్‌గా నిలుస్తుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాం. నిర్మాత ఎంతో సహకరించారు. ఈ సినిమాతో లక్ష్మీపతిగారు నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఘటికాచలం చాలా మంచి మ్యూజిక్ అందించారు. కెమెరామెన్ సురేందర్రెడ్డిగారి పనితనం సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుంది' అని తెలిపారు.
'మా అన్న కొడుకు సాయి చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులు నటించారు. సుమన్‌గారు పెద్ద మనసుతో సహాయ సహకారాలను అందించారు. మరో నాలుగైదు రోజులు మాత్రమే వర్క్ ఉంది. దసరా పండుగ రోజున చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం' అని నిర్మాత కాయగూరల లక్ష్మీపతి అన్నారు.
హీరో సాయి చరణ్ మాట్లాడుతూ, 'ఇది మా మొదటి చిత్రమే అయినా ఇందులో అందరూ పెద్ద పెద్ద స్టార్స్ నటించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించి, తొలి చిత్రంతోనే మాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాం' అని చెప్పారు. 'నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదొక కమర్షియల్ చిత్రం. కొత్తగా ఓ సైంటిఫిక్ పాయింట్ కూడా ఉంది. కాలేజీలో డ్రగ్స్ విషయం పై కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో నేను ఓ పోలీస్ కమీషనర్‌గా కనిపిస్తాను' అని సుమన్ తెలిపారు.