Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్‌ప్లేతో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఓదెల రైల్వేస్టేషన్'. అశోక్ తేజ్ దర్శకత్వంలో కె.కె.రాధా మోహన్ నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 26న 'ఆహా' వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వశిష్ట సింహ మాట్లాడుతూ,' ఇది చాలా మంచి కథ. నాకు చాలా ఇష్టమైన సినిమా. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా ఉంటుంది. ప్రతి పాత్ర ఆకట్టుకుంటుంది' అని తెలిపారు.
'సంపత్ గారు ఈ కథ చెప్పినపుడు చాలా సర్ప్రైజ్ ఫీలయ్యా. ఇలాంటి పాత్రని నేను ఎప్పుడూ చేయలేదు. అసలు నేను చేయగలనా? అనే అనుమానం కూడా వచ్చింది. నా కెరీర్లో చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. నా పాత్ర సవాల్‌తో కూడుకున్నది' అని నాయిక హెబ్బా పటేల్ అన్నారు.
నిర్మాత కె.కె.రాధా మోహన్ మాట్లాడుతూ, 'ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాని విడుదల చేయడానికి ఆహా ఒక వేదికని ఇచ్చింది. గతంలో 'ఆహా'లో విడుదలైన మా 'ఒరేరు బుజ్జిగా' అందరినీ అలరించింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నాను' అని చెప్పారు. 'కథ, మాటలు ఇచ్చిన సంపత్ నంది గారికి, నన్ను దర్శకుడిని చేసిన రాధా మోహన్ గారికి జీవితాంతం రుణపడివుంటాను. ఇందులో నటించిన అందరికి చాలా మంచి పేరు వస్తుంది' అని దర్శకుడు అశోక్ తేజ్ తెలిపారు. సాయి రోనక్ మాట్లాడుతూ,'ఇంతకుముందు కొన్ని సాఫ్ట్ పాత్రలు చేశాను. కానీ ఇందులో చాలా సీరియస్ కాప్ రోల్ చేశా. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని తెలిపారు.