Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనదైన విలక్షణ నటనతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విశేషంగా అలరించిన 'రెబల్‌స్టార్' కృష్ణంరాజు (82) ఇకలేరు.
నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అటు ప్రేక్షకులు, ఇటు ప్రజల మన్ననలు పొందిన కృష్ణంరాజు గత కొంత కాలంగా మధుమేహం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్నారు.
హైదరాబాద్‌లోని ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున (3.16 నిమిషాలకు) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తమ అభిమాన కథానాయకుడు 'రెబల్‌స్టార్' ఇక లేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమవు తున్నారు. వెండితెర రారాజుగా వెలుగొందిన 'రెబల్‌స్టార్' శాశ్వతంగా దూరమయ్యాడని పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు భావోద్వేగానికి గురయ్యారు.
విలక్షణ నటుడిగా, అభిరుచిగల నిర్మాతగా, నిస్వార్థ ప్రజానాయకుడిగా ఐదున్నర దశాబ్దాల కాలంగా సాహౌసోపేతమైన ప్రయాణంతో అందర్ని మెప్పు పొందిన 'రెబల్‌స్టార్' కృష్ణంరాజు జీవిత ప్రయాణంలోని కొన్ని విశేషాలు..
1940, జనవరి 20న మొగల్తూరులో శ్రీ ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణరాజు దంపతులకు కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజు అసలు పేరు శ్రీ ఉప్పలపాటి చిన వెంకట కృష్ణంరాజు. అయితే తనపేరుని షార్ట్‌కట్‌లో కృష్ణంరాజు అని ఆయన మార్చుకున్నారు.
చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్ట్‌గా ఆంధ్రరత్నలో పని చేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో బెెస్ట్ ఫొటోగ్రాఫర్‌గానూ ఆయన అవార్డు అందుకున్నారు. మొదట్నుంచి పలు రకాల కెమెరాలను కలెక్ట్ చేయటం కృష్ణంరాజుకి హాబీ.
1966లో కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొందిన 'చిలకా గోరింక' చిత్రంతో కృష్ణంరాజు కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ఆయన సరసన కృష్ణ కుమారి నటించారు. నటించిన తొలి చిత్రమే ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని దక్కించుకుంది. అయితే సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో నటుడిగా ఇక తాను కొనసాగలేననే నిరుత్సాహాంతో పరిశ్రమని వదలి వెళ్ళిపోవాలని కృష్ణంరాజు నిర్ణయించుకున్నారు. అయితే ఆ సమయంలో దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్ ఇచ్చిన ప్రోత్సాహంతో పరిశ్రమలో కొనసాగారు.
దీంతో 'చిలకా గోరింక'లో కథానాయకుడిగా నటించిన కృష్ణంరాజు ఆ తర్వాత 'నేనంటే నేను' చిత్రంలో ప్రతినాయకుడిగా ఛాయలున్న పాత్రను పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు. అలాగే 'అవే కళ్ళు' చిత్రంలోనూ విలన్‌గా నటించి అందర్నీ ఫిదా చేశారు. అలా కథానాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కృష్ణంరాజు తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు.
' శ్రీ కృష్ణావతారం' చిత్రంలో ఎన్టీఆర్, ఎన్నాఆర్‌లతో కలిసి నటించారు. ఆ తర్వాత 'భలే అబ్బాయిలు', 'బుద్ధిమంతుడు', 'మనుషులు మారాలి', 'మళ్ళీ పెళ్ళి', 'జై జవాన్', 'అమ్మ కోసం', 'అనురాధ', 'భాగ్యవంతుడు', 'బంగారు తల్లి', 'మహ్మద్‌బీన్ తుగ్లక్', 'రాజమహల్', 'హంతకులు దేవాంతకులు', 'నీతి నిజాయితీ', 'వింత దంపతులు', 'బడి పంతులు', 'బాలమిత్రుల కథ', 'జీవన తరంగాలు', 'కన్న కొడుకు', 'బంట్రోతు భార్య', 'కృష్ణవేణి', 'పరివర్తన', 'లక్ష్మి', 'ఇద్దరూ ఇద్దరే', 'గురుశిష్యులు', 'ఆడవాళ్ళ మీకు జోహార్లు', వంటి తదితర చిత్రాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కృష్ణంరాజు నటించి, మెప్పించారు. అయితే ఆయనకంటూ ఓ ప్రత్యేకతని మాత్రం తీసుకురాలేదు.
' రారాజు', 'పులి బొబ్బిలి', 'కటకటాల రుద్రయ్య', 'బ్రహ్మనాయుడు', 'తాండ్రపాపరాయుడు', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'రంగూన్‌రౌడీ', 'బాబుల్గాడి దెబ్బ', 'విధాత', 'భగవాన్' వంటి తదితర చిత్రాలు, ఆయా చిత్రాల్లోని కృష్ణంరాజు పోషించిన భిన్న పాత్రలు.. వెరసి ఆయనన్ని 'రెబల్‌స్టార్' చేశాయి.
గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌ని స్థాపించి, 'కృష్ణవేణి' (1974), 'భక్తకన్నప్ప' (1976), 'అమరదీపం' (1977), 'మనవూరి పాండవులు' (1978), 'సీతారాములు' (1980), 'మధుర స్వప్నం' (1982), 'బొబ్బిలి బ్రహ్మన్న' (1984), 'ధర్మాధికారి', (1986), 'తాండ్రపాపారాయుడు' (1986), 'బిల్లా' (2009), 'రాధేశ్యామ్' (2022) తదితర చిత్రాలను నిర్మించి, అభిరుచిగల నిర్మాతగానే కాకుండా ప్రయోగాలకు మారుపేరుగా కృష్ణంరాజు నిలిచారు.
ఐదున్నర దశాబ్దాలు కాలంలో దాదాపు 183 చిత్రాలకుపైగా ఆయన నటించారు. హీరోగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా ఎన్నో విలక్షణ, భిన్న సినిమాలు, పాత్రలతో అటు మాస్ ప్రేక్షకుల్ని, ఇటు క్లాస్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని మెప్పించిన ఆయన 'రాధేశ్యామ్' చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ఈ చిత్రంలో ఆయన తన నటవారసుడు ప్రభాస్‌తో కలిసి నటించటం ఓ విశేషమైతే, ఈ చిత్ర నిర్మాణంలో ఆయన కూడా భాగస్వామి కావడం మరో విశేషం.
1977లో నటించిన 'అమరదీపం', 'బొబ్బలి బ్రహ్మన్న' (1984' చిత్రాల్లోని నటనకు ఉత్తమ నటుడిగా, 1994లో నటించిన 'జైలర్‌గారి అబ్బాయి' చిత్రంలో క్యారెక్టర్ నటుడిగా నంది పురస్కారాలను కృష్ణంరాజు దక్కించుకున్నారు. అలాగే 'అమరదీపం', 'ధర్మాత్ముడు', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'తాండ్ర పాపారాయుడు' వంటి తదితర చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2014లో కృష్ణంరాజును ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు వరించింది.
నిర్మాతగా తాను నటించిన 'భక్తకన్నప్ప' చిత్రాన్ని, 'ఒక్క అడుగు' అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని, 'మనవూరి పాండవులు' సినిమాని ప్రభాస్‌తో రీమేక్ చేయాలనుకున్నారు. 'విశాల నేత్రాలు' నవల ఆధారంగా ఓ చిత్రాన్ని కూడా నిర్మించాలను కున్నారు. కానీ ఇవన్ని ఆయనకు కలగానే మిగిలిపోయాయి.
1991లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అదే ఏడాది నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బిజేపీలోకి చేరి, 1999లో నర్సాపురం నుంచి ఎంపీగా గెలుపొంది కేంద్రమంత్రిగా పనిచేశారు. ప్రభాస్ నటవారసుడిగా పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తుండగా, కృష్ణంరాజు పెద్ద కుమార్తె సాయి ప్రసీధ 'రాధేశ్యామ్' సినిమాతో నిర్మాతగా మారారు. రెండో కుమార్తె ప్రకీర్తి ప్రొడక్షన్ డిజైనర్‌గా ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' చిత్రానికి పని చేస్తున్నారు. మూడో కుమార్తె ప్రదీప్తి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు.