Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం 'అల్లూరి'. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. ఈనెల 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హీరో శ్రీవిష్ణు మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
పవర్ ఫుల్ పోలీస్ కథ
అల్లూరి అంటేనే పవర్ ఫుల్. ఆయన రియల్ అల్లూరి. ఈ అల్లూరి ఆయన నుండి స్ఫూర్తి పొంది చేసిన కథ. కృష్ణ గారి సినిమా అల్లూరి సీతారామారాజు క్లైమాక్స్‌లో 'ఒక అల్లూరి చనిపోతే వందమంది అల్లూరిలు పుడతారని' చెప్తారు. ఆ వందమందిలో మా అల్లూరి ఒకరు. (నవ్వుతూ). ఇదొక పోలీస్ స్టొరీ. అల్లూరి అనే ఫిక్షనల్ పాత్ర తీసుకుని, కొన్ని యదార్ధంగా జరిగిన సంఘటనలు ఆధారంగా తీర్చిదిద్దాం. విధుల్లోకి చేరినప్పటి నుండి 15 ఏళ్ల సర్వీస్‌లో ఒక పోలీస్ ఏం చేశాడనేది ఒక అద్భుతమైన టైమ్ లైన్ ఇందులో చూపించబోతున్నాం.
వాస్తవ సంఘటనల ఆధారంగా..
దర్శకుడు ప్రదీప్ వర్మ పూర్తి కథతో నా దగ్గరరికి వచ్చారు. ఈ కథలో సంఘటనలు నిజంగా జరిగినవేనని సినిమా చేస్తున్న క్రమంలో ఒకొక్కటిగా తెలిసింది. ఈ కథ విన్నప్పుడు పోలీస్ వ్యవస్థలో ఇంత డెప్త్ ఉందా అనిపించింది. ఎలాంటి పరిస్థితిలోనైనా నిజాయితీగా ఉంటూ విధిని నిర్వహించే ఓ పోలీస్ కథ ఇది. వ్యవస్థలో మంచి, చెడులు ఇందులో చూపిస్తాం. చెడుకి పరిష్కారం కూడా చూపిస్తాం. ఈ సినిమాలోని పాత్ర కోసం ప్రత్యేకంగా పోలీసుల్ని కలవలేదు. అయితే గత పదిహేను రోజులుగా చేసిన యాత్రలో చాలా మంది పోలీసు అధికారులని కలిశాను. వారి సేవలకు కృతజ్ఞతలు చెప్పాను. ఇందులో పోషించిన పాత్ర నా నిజ జీవితంపై చాలా ప్రభావం చూపించింది. బేసిగ్గా నేను చాలా సున్నితంగా మాట్లాడతాను. చాలా విషయాలకి రియాక్ట్ అవ్వను. ఐతే ఈ పాత్ర చేసిన తర్వాత నా చుట్టూ జరిగే కొన్ని విషయాలపై కాస్త వాయిస్ పెంచి మాట్లడుతున్నా.
అందుకే బన్నీని పిలిచా..
బన్నీగారితో నాకు పదేళ్ళుగా మంచి స్నేహం ఉంది. నా సినిమాల మంచి, చెడులు చెప్తుంటారు. అయితే ఎప్పుడూ ఆయన్ని ఏమీ అడగలేదు. ఆయన్నే కాదు సినిమా గురించి ఇండిస్టీలో ఎప్పుడూ ఎవర్నీ ఏమీ అడగలేదు. కానీ, ఈ సినిమాకి కొత్త ఆడియన్స్ కావాలి. దీనికి నా ఒక్కడి బలం సరిపోదు. అందుకే బన్నీగారిని పిలిచా. ఆయన పిలవగానే వచ్చారు. అలాగే నాని, రవితేజ గారు కూడా మేం అడిగిన వెంటనే మాకు సపోర్ట్ చేశారు.
మనసుకి నచ్చింది..
ఏ సినిమా అయినా సరే నా మనసుకి నచ్చితే ఖచ్చితంగా బలంగా చెప్తాను. 'నీది నాదీ ఒకటే కథ, అప్పట్లో ఒకడు, బ్రోచేవారు, రాజరాజ చోర' .. ఈ సినిమాలన్నిటికీ చాలా బలంగా చెప్పా. అలాగే ఈ సినిమా కూడా. అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అవ్వాల్సిన సినిమా అల్లూరి. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఒక స్ఫూర్తిని నింపే సినిమా. కంటెంట్ పై చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు 3 సినిమాలు చేస్తున్నా. 'రాజ రాజ చోర' ఫేమ్ హాసిత్, సాయి (కొత్త దర్శకుడు), 'హుషారు' ఫేమ్ హర్షతో ఉన్నాయి.