Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవార్డుల కోసం జ్యూరీ ఎంపిక చేసే సినిమాలపై తరచూ విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. పైగా ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డు కోసం సెలెక్ట్ చేసే సినిమాపై కచ్చితంగా విమర్శలు వస్తాయి.
95వ ఆస్కార్ పురస్కారాల కోసం మన దేశం నుంచి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో 'ఛెల్లో షో' అనే గుజరాతీ చిత్రాన్ని జ్యూరీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్', 'ది కశ్మీర్ ఫైల్స్'తోపాటు దేశవ్యాప్తంగా మరో 13 చిత్రాలు జ్యూరీ పరిశీలనకు వెళ్ళగా, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) 'ఛెల్లో షో' చిత్రాన్ని సెలెక్ట్ చేసింది. దీంతో 95వ అస్కార్ పురస్కారాల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 'ఛెల్లో షో' అమీతుమీ తేల్చుకోనుందని ఎఫ్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సుప్రన్సేన్ తెలిపారు. అయితే ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డుల కోసం ఎంపిక చేయటం పట్ల తెలుగు చిత్ర సీమ నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దర్శకులు ఎన్.శంకర్, వై.కాశీ విశ్వనాథ్ 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఎంపిక చేయకపోవడం పట్ల బాధని వ్యక్తం చేస్తూ, 'ఛెల్లో షో' ఎంపిక అన్యాయమంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా జ్యూరీ గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'ని ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్‌కి నామినేట్ చేసిందని విన్న తర్వాత 'ఛెల్లో షో' టీజర్ చూశాను. అలాంటి కంటెంట్ చిత్రాలు సౌత్‌లో చాలా వచ్చాయి. పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ కమిటీలకు చైర్మెన్‌గా పని చేసిన అనుభవంతో 'ఆర్ఆర్ఆర్' సినిమాని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. 'ఆర్ఆర్ఆర్'లో దేశ భక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలు, భారతీయ సినిమా ప్రతిష్టను కాపాడటానికి చిత్ర బృందం చేసిన కృషి మనందరికీ తెలిసిందే. గుజరాతీ చిత్రం 'ఛల్లో షో'ని ఏ కోణంలో నామినేట్ చేశారో తెలియదు కానీ 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని పంపకపోవడం బాధకలిగించింది.
- ఎన్ శంకర్, దర్శకుడు
దేశభక్తిని చాటి చెప్పే చిత్రాలు ఎన్నో వచ్చాయి. ఫిక్షన్ యాంగిల్లో.. కల్పిత కధతో ఎంతో కష్టపడి.. ఎన్నో సంవత్సరాలు వెచ్చించి.. అద్భుతంగా తెరకెక్కించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. 'కంటెంట్' పరంగా గాని.. 'సందేశం' పరంగా గాని.. దేశ ఖ్యాతిని ఇనుమడింప జేసే సినిమా. 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలో సీన్స్ రక్తి కట్టించడంలో గాని.. నటీనటుల నుంచి పెరఫార్మెన్స్ రాబట్టుకోవడంలో గాని.. దర్శకులు రాజమౌళి ప్రాణం పెట్టి పని చేశారు. హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలలో జీవించారు. టెక్నీషియన్స్ ప్రతిభ అమోఘం. అలాంటి సినిమాని ఆస్కార్‌కి నామినేట్ చేయకుండా 'చెల్లో షో' అనే గుజరాతీ సినిమాను నామినేట్ చేయడం.. శోచనీయం. దీన్ని ఖండిస్తున్నాం.
- వై. కాశీ విశ్వనాథ్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు
ఇప్పుడు ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో 'ఆర్ఆర్ఆర్' సినిమాని ఎంపిక చేయలేదని టాలీవుడ్ ఎలా విమర్శిస్తుందో, 63వ జాతీయ అవార్డుల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా జ్యూరీ ఎంపిక చేసిన 'బాహుబలి' చిత్రంపై ఇతర చిత్ర పరిశ్రమలు విమర్శల్ని గుప్పించాయి. ఓ కమర్షియల్ సినిమాని పైగా సగ భాగం మాత్రమే ఉన్న చిత్రాన్ని ఎలా ఉత్తమ చిత్రంగా ఎంపిక చేస్తారంటూ పలు భాషలకు చెందిన అగ్ర దర్శకులు కామెంట్స్ చేశారు. ముఖ్యంగా పంజాబ్ చిత్ర దర్శకుడు గుర్విందర్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. 'జాతీయ అవార్డు జ్యూరీ కమిటీ ప్రాంతీయ చిత్రాలను, పార్లల్ సినిమాలను గాలికి వదిలేసి, కమర్షియల్ సినిమాకి పట్టం కట్టింది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థకి ఇదొక నిలువుటద్దం'.
- గుర్విందర్‌సింగ్, 'ఛౌతి కూట్' చిత్ర దర్శకుడు
అప్పుడు, ఇప్పుడు కూడా రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలపై విమర్శలు రావడం గమనార్హం.