Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు కృష్ణ సతీమణి, మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి (70) మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, ఆ కుటుంబ అభిమానులు మరోసారి శోకసంద్రంలో మునిగిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు, అభిమానుల దర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని పద్మాలయా స్టూడియోలో ఉంచారు. ఆమెకు తుది నివాళి అర్పించేందుకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తరలి వచ్చారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్, నాగార్జున, వెంకటేష్, కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, అశ్వనీదత్, కొరటాల శివ, మురళీమోహన్, మోహన్‌బాబు, తమన్ తదితరులు ఇందిరాదేవికి తుది నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.కృష్ణ, మహేష్‌బాబు, ఇతర కుటుంబసభ్యుల్ని పరామర్శించి, ఓదార్చారు. నాన్నమ్మ ఇందిరాదేవి పార్ధివదేహాన్ని చూసి మహేష్‌బాబు కుమార్తె సితార తట్టుకోలేక పోయింది. మహేష్‌బాబు ఒడిలో కూర్చుని కన్నీటి పర్యంతమైంది. మహేష్‌బాబు ఎంత ఓదార్చినప్పటికీ సితార ఏడుపుని ఆపుకోలేకపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఇందిరాదేవి అంత్యక్రియలు జరిగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమం వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు.
కృష్ణ రెండవ భార్య విజయనిర్మల, ఆ తర్వాత మహేష్‌బాబు సోదరుడు రమేష్‌బాబు, ఇప్పుడు ఇందిరాదేవి.. ఇలా వరుస మరణాలతో కృష్ణ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణ, ఇందిరాదేవిలకు ఐదుగురు సంతానం. పద్మావతి, మంజలు, ప్రియదర్శిని, రమేష్‌బాబు, మహేష్‌బాబు.
నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఏ సినిమా రిలీజైనా ముందు అమ్మ దగ్గరికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంటుంది. ఆమె ఆశీస్సులు నాకెప్పటికీ ముఖ్యం. ఆమె ఆశీస్సుల వల్లే నాకు ఈ విజయం వచ్చింది.
- మహేష్‌బాబు