Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపురం స్టూడియోస్ పతాకంపై కె.బాబు రెడ్డి, జి.సతీష్‌కుమార్ నిర్మించిన చిత్రం 'లిల్లీ'. ఈ చిత్రంతో శివమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నేహ లీడ్రోల్లో వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన ఈ చిత్రంలో రాజ్వీర్ ముఖ్యప్రాతలో నటించారు. శనివారం ఈ సినిమా ప్రమోషన్‌ను లాంఛనంగా ప్రారంభించింది చిత్రయూనిట్. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వి.వి. వినాయక్ 'లిల్లీ' సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు సినిమాలోని ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'దర్శకుడు శివమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్యాన్సర్ పై పోరాటం మీద ఉంటుంది. క్యాన్సర్‌ని ఓ డైనోసార్‌తో పోలుస్తూ పోస్టర్ని డిజైన్ చేసిన విధానం నచ్చించి. సీనియర్ నటుడు శివకృష్ణ మనవడు నటించిన ఈ సినిమా హిట్ అవ్వాలి' అని అన్నారు. 'ఎంతో మంచి కంటెంట్ ఉన్న సినిమా బాలల సినిమా ఇది' అని నటుడు శివ కృష్ణ తెలిపారు. దర్శకుడు శివమ్ మాట్లాడుతూ,'మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'అంజలి' సినిమానే ఈ చిత్రానికి స్ఫూర్తి. ఈ రోజుల్లో ఒక బాలల చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేసే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు' అని చెప్పారు.
'ప్రస్తుత సమాజంలో పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్లాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు. కానీ, మా సినిమాకి పెద్దవాళ్లే సినిమా చూడమని పిల్లల్ని పంపుతారు' అని నిర్మాత బాబురెడ్డి తెలిపారు.
మరో నిర్మాత సతీశ్ మాట్లాడుతూ,'పిల్లలంటేనే ఎమోషన్. కూతురున్న ప్రతి తల్లితండ్రులు లిల్లీ లాంటి బంగారుతల్లి మా ఇంట్లోకూడా ఉంటే బావుండు అనుకుంటారు. మా చిత్రాన్ని దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం' అని చెప్పారు.