Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం 'స్వాతిముత్యం'. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవు తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, 'సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత నాగవంశీ కథ విని, నేను కథ చెప్పే విధానం, నా డెమో ఫిల్మ్ చూసి అవకాశమిచ్చారు. నాకు త్రివిక్రమ్ స్ఫూర్తి. నా మొదటి సినిమా స్క్రిప్టే ఆయన చదివి, చాలా బాగా రాశావని ప్రశంసించారు' అని చెప్పారు. 'ఈనెల 5న స్వాతిముత్యం సినిమా వస్తుంది. ఈ సినిమా అసలు నిరాశపరచదు. థియేటర్‌కి వచ్చిన అందరికీ ఖచ్చితంగా వినోదాన్ని పంచుతుంది. చిరంజీవి ఆయన సినిమా ఫంక్షన్లో వర్షంలో తడుస్తూ కూడా గుర్తుపెట్టుకొని మా సినిమా గురించి మాట్లాడినందుకు ఆయనకు హదయకపూర్వక ధన్యవాదాలు. ఈనెల 5న 'గాడ్ ఫాదర్'తో పాటు మా సినిమాని కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం' అని నిర్మాత నాగవంశీ అన్నారు.
హీరో గణేష్ మాట్లాడుతూ, 'ఇంత మంచి కథ ఇచ్చిన లక్ష్మణ్‌కి ధన్యవాదాలు. చినబాబుకి, వంశీకి నేను జీవితాంతం ఋణపడి ఉంటాను' అని చెప్పారు.