Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'జెట్టి'. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహిస్తున్నారు. చివరి దశ సన్నాహాల్లో ఉన్న ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ, 'విలేజ్ బ్యాక్ డ్రాప్లో పల్లెటూరి అమ్మాయిగా నటించాలి అనేది నా కోరిక. అది ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమా గురించి చెబితే అర్థం కాదు. తెరపై చూసి అనుభూతి చెందాల్సిందే. చీరాల ప్రాంతాన్ని మా చిత్రంలో సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా గురించి మా నిర్మాత మొదట్నుంచీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ సినిమాతో మంచి విజయం సాధిస్తామనే నమ్మకం మా అందరిలో ఉంది' అని అన్నారు. 'సినిమా మేకింగ్‌లో నిర్మాత వేణు మాధవ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మత్స్యకారుల జీవితాల్లోని సమస్యలను చెప్పే చిత్రమిది. కొందరు తమ స్వార్థంతో పోర్టుల పేరుతో మత్య్సకారుల జీవితాలను ఎలా ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఇట్రెస్టింగ్‌గా తెరకెక్కించాం. హీరో, హీరోయిన్లతో పాటు మైమ్ గోపీ వంటి స్టేజీ ఆర్టిస్టులు తమ, తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు' అని దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక చెప్పారు. నిర్మాత వేణు మాధవ్ కె మాట్లాడుతూ, ''జెట్టి' అంటే పోర్టు అని అర్థం. మన సముద్ర తీరాన ఎంతోమంది మత్స్యకారులు జీవితాలను సాగిస్తున్నారు. వారి జీవితాల్లోని సమస్యలను ప్రతిబింబించే చిత్రమిది. సగటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. కార్తీక్ కొడకండ్ల సంగీతం ప్రధాన ఆకర్షణ అవుతుంది' అని తెలిపారు.