Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి, రితిక చక్రవర్తి జంటగా ఓ సినిమా రూపొందుతోంది.
చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రమిది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు సత్యసాయి కల్యాణమండపంలో ఘనంగా జరిగాయి.
హీరో, హీరోయిన్ల పై ముహూర్తపు షాట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో ఆకాష్ పూరి క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ, 'నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి నిర్మాత వి.శ్రీనివాస రావ్ ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబంధించిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. అందరూ కొత్త వారు నటిస్తున్నప్పటికీ చాలా మంది సీనియర్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఈ నెల 17 నుండి చీరాలలో మొదటి షెడ్యూల్, హైదరాబాద్‌లో జరిగే రెండవ షెడ్యూల్‌తో సినిమాని పూర్తి చేస్తాం' అని తెలిపారు.
'మేం పిలవగానే వచ్చి, మమ్మల్ని బ్లెస్ చేసిన హీరో ఆకాష్ పూరి, నిర్మాత వి.రావుకు ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా. దర్శకుడు వెంకటేష్ చెప్పిన కథ నచ్చడంతో మహీంద్ర పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నాను. ప్రేక్షకులందరికి నచ్చేవిధమైన అన్ని అంశాలతో వస్తున్న ఈ సినిమా మా బ్యానర్‌కు మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను' అని నిర్మాత వి.శ్రీనివాస రావు అన్నారు.
చిత్ర హీరో చైతన్య పసుపులేటి మాట్లాడుతూ, 'ఇది నా మూడవ సినిమా. నా మెదటి సినిమా నుండి దర్శకుడు వెంకటేష్ తెలుసు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి టీం, మంచి కథతో తీస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని చెప్పారు. ''బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది' సినిమాలో హీరోయిన్గా నటించాను. ఆ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత విజయదేవరకొండ 'ఖుషి' సినిమాలో, 'అనంత' సినిమాల్లో నటిస్తున్నాను. ఇదొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఇలాంటి మంచి కథలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని హీరోయిన్ రితిక చక్రవర్తి తెలిపారు. కెమెరామెన్ సుధాకర్ మాట్లాడుతూ, 'కెమెరామెన్‌గా నాకు ఇది ఐదవ సినిమా. విజయ దశమి సందర్భంగా ఈ సినిమా ఓపెనింగ్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.