Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి రూపొందించిన తాజా చిత్రం 'స్వాతిముత్యం'. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 5న విడుదలై, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం తాజాగా ఘనంగా విజయోత్సవ వేడుకకు నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, 'మా సినిమాకి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ పట్ల చాలా సంతోషంగా ఉంది. సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి చాలా సహజంగా మన మధ్యలో జరిగినట్లు ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. విమర్శకులు కూడా అన్ని పాత్రలకు ప్రాధాన్యమిస్తూ మంచి వినోదాన్ని పంచామని ప్రశంసించడం మరింత ఆనందంగా ఉంది. మొదటి నుంచి ఈ కథని నమ్మి, మా అందరికీ కూడా అదే నమ్మకాన్ని కలిగించిన నిర్మాత నాగ వంశీకి, గణేష్‌కి ధన్యవాదాలు' అని చెప్పారు. 'విడుదలకు ముందే ఈ సినిమా చూసి నవ్వుకుంటూ బయటకు వస్తారని మేం చెప్పాం. అయితే మేం ఊహించిన దానికంటే ఎక్కువగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. దాన్ని బట్టే చెప్పొచ్చు ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో' అని నాయిక వర్ష బొల్లమ్మ అన్నారు. హీరో గణేష్ మాట్లాడుతూ, 'ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. మా సినిమాకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నటుడిగా నన్ను ప్రేక్షకులు అంగీకరించారు. ప్రతి ఒక్కరూ తెర మీద గణేష్ కనిపించలేదు, బాల అనే కుర్రాడు మాత్రమే తెర మీద కనిపించాడు అన్నప్పుడు.. నటుడిగా ఓ పది మార్కులు వేయించుకున్నాను అని చిన్న తృప్తి కలిగింది' అని తెలిపారు. 'మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయం. 'స్వాతిముత్యం', 'గాడ్‌ఫాదర్' రెండు చిత్రాలూ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. రోజురోజుకి వసూళ్ళు పెరుగుతున్నాయి' అని నిర్మాత నాగ వంశీ అన్నారు. దివ్య శ్రీపాద మాట్లాడుతూ, 'ఈ సినిమాలో శైలజ అనే పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ఇలాంటి పాత్ర రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విజయం మరింత ఉత్సాహాన్నిచ్చింది' అని చెప్పారు.