Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత చూపించారు అనే కథాంశంతో వస్తున్న జీరో బడ్జెట్ చిత్రం 'శరపంజరం'. దోస్తాన్ ఫిలిమ్స్ పతాకంపై టి.గణపతిరెడ్డి, మామిడి హరికృష్ణ సహకారంతో నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రంలోని రెండవపాట 'రావయ్యా నందనా రాజా నందన' అంటూ జానపద కళాకారుడు గిద్దె రాంనర్సయ్య రాసి, పాడిన ఈ పాటను సీనియర్ కథానాయిక విజయశాంతి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'ఈ పాట చూశాక పల్లెదనం కళ్ళకు కట్టినట్టు కనబడుతుతుంది. ఆనాడు దొరలు తమ స్వార్ధం కోసం ఆడవాళ్ళని ఎలా వాడుకున్నారో అందరికి తెలిసిన విషయమే. ఈనాటి దొర కూడా ఎలా చేస్తున్నాడో తెలిసిన విషయమే. సమయం మారింది కానీ వ్యక్తి మనస్తత్వం మారలేదు అనడానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఈ జీరో బడ్జెట్ సినిమా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను' అని అన్నారు.
ప్రోత్సాహాకులు టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ, 'ఈ సినిమా ప్రారంభమైన దగ్గర్నుంచి మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి. విజయశాంతి మా చిత్రంలోని పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటపెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.
'ఈ మూవీ కాన్సెప్ట్ నచ్చి ఉచితంగా సంగీతాన్ని అందించటానికి అంగీకరించాను. సహకరించిన లిరిక్ రైటర్స్, సింగర్స్,వాయిద్యకారులకు ధన్యవాదాలు' అని సంగీత దర్శకుడు మల్లిక్ ఎం వి కె చెప్పారు. దర్శకుడు నవీన్ కుమార్ గట్టు మాట్లాడుతూ, 'ఈ పాట లేడీ సూపర్ స్టార్ చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషం. చిన్నప్పటి నుండి ఆమె సినిమాలు చేస్తూ పెరిగా. ఈ పాట చూశాక ఆమె ఈ పాట చాలా సహజంగా ఉంది అనే మాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.' అని అన్నారు.