Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. ఈ సినిమాను డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వీడియో రూపంలో ప్రకటించింది.
ఈ సందర్భంగా నిర్మాతలు సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ, 'మేం ఇంతకు ముందు బ్రహ్మానందంపై విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్‌గ్లింప్స్, 'ఏ రాగమో' లిరికల్ వీడియోకు, విజయదేవరకొండ చేతుల మీదుగా విడుదల చేసిన 'అరెరే.. అరెరే.. మాటే..రాదే.. మనసే పలికే క్షణములో..లిరికల్ వీడియో సాంగ్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
బ్రహ్మానందం మా సినిమాలో వేదవ్యాస్‌గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజరు, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద అందరూ చాలా బాగా నటించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, డిసెంబర్ 9న మా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.
'మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా కథలోని పాత్రలు అందంగా, ఆసక్తికరంగా ఉండేలా తెరకెక్కించడం జరిగింది. వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం జీవించారు. అలాగే బ్రహ్మానందం, స్వాతిరెడ్డి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. వీరి పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేస్తాయి' అని దర్శకుడు హర్ష పులిపాక తెలిపారు.