Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గాడ్‌ఫాదర్' బ్లాక్‌బస్టర్ సక్సెస్‌మీట్‌లో చిరంజీవి
చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు.
దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని, సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి ప్రపంచం నలుమూలల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. నా జీవితంలో 'ఇంద్ర, ఠాగూర్' తర్వాత ఆ స్థాయి విజయం అంటుంటే ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే సినిమాకి వస్తారని నేనే చెప్పాను. ఈ సినిమాతో ఆ నమ్మకం మరోమారు నిజమైంది. ప్రేక్షకులు చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మహిళలకు కూడా ఈ చిత్రం అమితంగా నచ్చడం ఒక శుభసూచికంగా భావిస్తున్నాను. దర్శకుడు మోహన్ రాజా 'లూసిఫర్'లో లేని చాలా మ్యాజిక్స్ ఈచిత్రంలో అద్భుతంగా చూపించారు. సత్యనంద్, మాటల రచయిత లక్ష్మీ భూపాల్.. ఇలా అందరితో చక్కని టీం వర్క్ చేశాం. నా అనుభవంతో చెప్పే ప్రతి చిన్న మార్పుని దర్శకుడు మోహన్ రాజా అండ్ టీం ఎంతో గొప్పగా అర్ధం చేసుకుని, మరింత చక్కగా డిజైన్ చేశారు. అందుకే ఇంత గొప్ప ఆదరణ లభించింది. ఇందులో నేను కళ్ళతోనే నటించానని ప్రశంసలు వస్తున్నాయంటే .. ఈ క్రెడిట్ అంతా సినిమాలో పని చేసినందరికీ వెళ్తుంది. ఈ సినిమా గొప్ప విజయం ఇవ్వాలని పనిచేశాం. ఆ విజయం వరిచింది. జీవితంలో అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉండవు. సల్మాన్‌ఖాన్ మాపై ప్రేమ, ఆప్యాయతతో ఈ సినిమా చేశారు. పారితోషికాన్ని కూడా తిరస్కరించారు. అయితే సల్మాన్ భారుకి చరణ్ తగిన కానుక ఏర్పాటు చేస్తారు. తమన్ సంగీతం ఈ చిత్రానికి ఆరో ప్రాణం. అలాగే ఈ సినిమాకి టైటిల్ ఇచ్చింది కూడా తమనే. సత్యదేవ్ అద్భుతమైన ఫెర్ ఫార్మ్మెన్స్ చేసి, ఈ చిత్రానికి మరో పిల్లర్‌గా నిలిచారు. నయనతార తన నటనతో ఎంతో హుందాతనాన్ని తీసుకొచ్చారు. మురళి శర్మ అద్భుతంగా చేశారు. పూరి జగన్నాథ్ మాపై ఉన్న ప్రేమతో ఈ సినిమాలో ఒక చక్కని పాత్రలో కనిపించారు. ఎక్కడా తప్పుపట్టలేని సినిమా ఇది. పవర్ ఫుల్ కంటెంట్ ఉన్న చిత్రమిది. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. నా జీవితంలో అత్యద్భుతమైన చిత్రాలు పదిహేను ఉంటే, అందులో ఇదొకటి' అని తెలిపారు.
'ఈ సినిమాకి మూలకారణం చరణ్ బాబు. చరణ్ బాబు లేకపొతే సల్మాన్ ఖాన్ ఇంటి గేటు దగ్గరికి కూడ వెళ్ళలేం. చరణ్ బాబు మాకు ఇంతగొప్ప అవకాశం ఇచ్చారు. దాన్ని మేము నిలబెట్టుకున్నాం. ఈ సినిమా సెన్సేషనల్ హిట్. థియేటర్లో 80 శాతం మహిళా ప్రేక్షకులు ఉండటం అంటే మాములు విజయం కాదు' అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు.
దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ,'ఎడిటర్ మోహన్ అబ్బాయిలుగా మాకు ఎంతో గౌరవం ఉంది. ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత ఆయన్ని మళ్ళీ ఈ వేడుకకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలోని ప్రతి సన్నీవేశంలో చిరంజీవి ఇన్పుట్స్ ఉన్నాయి. ఆయన అనుభవాన్ని వాడుకున్నాం కాబట్టే ఈ రోజు సినిమా ఇంత గొప్ప విజయం సాధించింది. ఎన్వీ ప్రసాద్‌కి, అలాగే ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు' అని చెప్పారు.