Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
గాడ్‌ఫాదర్ విజయం మీకెంత ప్రత్యేకమైనది?
- సినిమాని సమిష్టి కషి అని నమ్ముతాను. ఒక విజయం వెనుక సమిష్టి కషి ఉంటుంది. అందుకే ఒక విజయం కేవలం నాదీ అని అనుకోను. ఏప్రిల్‌లో వచ్చిన 'ఆచార్య' నిరాశపర్చింది. దానికి నేను చేయాల్సిన ధర్మం చేశాను. చాలా పెద్ద మొత్తం నాది కాదని వదిలేశాను. రామ్ చరణ్ కూడా వదిలేశాడు. నేను వదులుకున్నది బయ్యర్లుని కాపాడుతుందనే సంతప్తి నన్ను ఫ్లాఫ్కి కృంగిపోయేలా చేయలేదు. 'గాడ్ ఫాదర్' విజయం కూడా కేవలం నాదీ అని అనుకోను. ఈ విజయం సమిష్టి కషి. అయితే ఈ విజయానికి నా కెరీర్లో చాలా ప్రత్యేకత ఉంది.
'లూసిఫర్' రీమేక్ ఆలోచన ఎవరిది?
- 'లూసిఫర్'ని చూసినప్పుడు అలాంటి పాత్రలు చేసి యాక్సప్టెన్సీ తెచ్చుకోగలిగితే మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు చేసే అవకాశం ఉంటుందనే ఆలోచన ఉండేది. చరణ్ ఒక రోజు 'లూసిఫర్' ప్రస్తావన తీసుకొచ్చాడు. దర్శకుడు సుకుమార్ చిన్న చిన్న మార్పులు చేస్తే 'లూసిఫర్' నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పారట. సుకుమార్ ఐడియా ఇచ్చారు. కానీ తర్వాత అందుబాటులో ఉండలేదు (నవ్వుతూ). ఒక రోజు చరణ్ దర్శకుడు మోహన్ రాజా పేరు చెప్పారు. 'తని వరువన్'ని అద్భుతంగా తీసిన దర్శకుడు మోహన్ రాజా. 'లూసిఫర్' రీమేక్‌కి మోహన్ రాజా న్యాయం చేస్తాడనే సంపూర్ణ నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు.
మీ సినిమా అంటే పాటలు, డాన్స్ ఆశిస్తారు. అలాంటివి లేకుండా సినిమా చేయటం సాహసమనిపించలేదా?
- కచ్చితంగా పాటలు, డాన్స్ ఆశిస్తారు. అయితే ఇది పవర్ఫుల్ సబ్జెక్ట్. ఇలాంటి సబ్జెక్ట్‌లు చేస్తే బావుంటుందనే మాటే తప్ప సాంగ్స్, డ్యాన్స్‌లు లేవని ఎక్కడా నెగటీవ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమా చూసినపుడు పాటలు లేవనే భావం కలగలేదు. దీనికి కారణం తమన్. నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు. యాక్షన్ సీన్స్‌కి ఇంత హై రావడానికి కారణం తమన్ మ్యూజికే. ఈ సినిమాకి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ సూచించింది కూడా తమనే.
సల్మాన్ పాత్ర గురించి?
- ఇందులో నాకు సేనాపతిగా కనిపించే పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించారు. సల్మాన్ ఖాన్ అయితే బావుటుందని మోహన్ రాజా అన్నారు. సల్మాన్‌తో చరణ్ మాట్లాడారు. సల్మాన్ మాపై ఎంతో ప్రేమతో మరో ఆలోచన లేకుండా 'చిరు కోరితే నేను నటించడానికి రెడీ' అని చెప్పారు. అలాగే సత్యదేవ్, పూరీజగన్నాథ్, నయనతార..ఇలా ప్రతి ఒక్కరి పాత్ర సినిమా విజయానికి బాగా దోహదపడింది.
యువ దర్శకులతో పని చేయడం ఎలా ఉంది?
- ఇప్పుడున్న యువ దర్శకులకు విస్తృతమైన సమాచారం ఉంది. వారు కోరుకున్నది ప్రజెంట్ చేయడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. నా ఇమేజ్, వారు కొత్తగా చూపించే విధానం.. ఈ కాంబినేషన్ బావుంటుందని నమ్ముతాను. అందుకే యువ దర్శకులతో ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతాను.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ?
- బాబీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో నా నుండి కోరుకునే పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే 'భోళా శంకర్'లో కూడా మంచి మార్పులతో అద్భుతమైన వినోదం ఉంటుంది.
మీరు పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తారా?
- మా తమ్ముడితో చేయాలనే సరదా నాకు ఉంటుంది. అన్నయ్యతో చేయాలని తనకీ ఉంటుంది. అన్నీ కుదిరితే మేమిద్దరం సినిమా చేయాలని చాలా ఉత్సాహంగా ఉంది.
సల్మాన్‌లా మీరూ వేరే భాషా చిత్రాల్లో నటిస్తారా?
- తప్పకుండా చేస్తాను. అందరూ చేయాలని కోరుతాను. ఎలాంటి భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా 'ఇండియన్ సినిమా' అనే పేరు రావాలని నా కోరిక. 'బాహుబలి', 'కే జీ ఎఫ్', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో ఎల్లలు చేరిగిపోయాయనే భావిస్తాను. ఇది మంచి పరిణామం.
చాలా విషయాల్లో తగ్గితే తప్పేంటనే ధోరణి మీలో కనిపించడానికి కారణం?
- ఇక్కడ తగ్గడం అని కాదు. సంయమనం పాటించడం. నిజాలు నిలకడగా తెలుస్తాయనే మాటని నమ్మేవాడిని నేను. ఇది నమ్మాను కాబట్టే.. నన్ను ఎద్దేవా చేసినవారే మళ్ళీ వారి తప్పుని తెలుసుకుని, నా దగ్గరికి వస్తే వారిని ప్రేమగా దగ్గర తీసుకోవడమే నాకు తెలిసిన ఫిలాసఫీ. ఎంతమంది మనసులకు దగ్గరయ్యానన్నదే నాకు ముఖ్యం. ప్రేక్షకులు, ఇండిస్టీ నన్ను ఎంతగానో ఆదరించింది.