Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ క్రియేషన్స్ పతాకం పై నిక్షిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'హంట్'. నర్సింగ్ రావు స్వీయ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రమిది. ఈ చిత్ర మోషన్ టీజర్‌ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. అయితే 'హంట్' టైటిల్‌తో హీరో సుధీర్ బాబు చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ, ఈ టైటిల్ మాదేనని చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సమావేశంలో ఎమ్.ఎస్.ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కష్ణ మాట్లాడుతూ, ''హంట్' అనే టైటిల్‌ను 6 నెలల క్రితం ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసుకున్నాము. ఇప్పుడే అదే చిత్ర టైటిల్‌తో భవ్య క్రియేషన్స్ వాళ్ళు సుధీర్ బాబు హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై ఛాంబర్లో రిజిస్టర్ అయింది. మీరు ఎలా పెడతారని భవ్యవారిని రిక్వెస్ట్ చేశాం. ఫిలిం ఛాంబర్లో కూడా మా సమస్యని తెలియజేశాం. ఛాంబర్ వాళ్ళు కూడా భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళతో మాట్లాడారు. కానీ మా సమస్యకు పరిష్కారం లభించలేదు. ఒక టైటిల్ రిజిస్ట్రేషన్‌కి వచ్చినప్పుడు 21 రోజుల వ్యవధిలో వేరే చిత్రానికి ఈ టైటిల్ రిజిస్టర్ అయిందా లేదా అని చెక్ చేసి మరి, టైటిల్‌ని రిజిస్టర్ చేస్తారు. మరి మేం రిజిస్టర్ చేసుకున్న తర్వాత భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళు ఎలా 'హంట్' చిత్ర టైటిల్‌ని వాడతారు?' అని అన్నారు.
హీరో, డైరెక్టర్ నిక్షిత్ మాట్లాడుతూ, 'మా సినిమా టైటిల్‌ని రాయల్‌గా దొంగిలించారు. మూడు నెలలుగా టైటిల్ మార్చుకోమని భవ్య వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు పట్టించుకోకపోగా మమ్మల్నే టైటిల్ మార్చుకోమంటున్నారు' అని తెలిపారు. 'మా సినిమా షూటింగ్ జరుగుతోంది. మా చిత్ర ఆడియో రైట్స్ అమ్మటానికి ప్రయత్నం చేస్తే, 'హంట్' పేరుతో వేరే చిత్రం ఉందని చెప్పి, వాళ్ళు కొనలేదు. దీని వల్ల మాకెంతో నష్టం జరిగింది. టైటిల్ విషయంలో భవ్య వాళ్ళు ఇప్పటికైనా స్పందించాలి. మాకు న్యాయం జరగాలి' అని నిర్మాత నర్సింగ్ రావు తెలిపారు.