Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివకార్తికేయన్ కథానాయకుడిగా, అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన చిత్రం 'ప్రిన్స్'. మారియా ర్యాబోషప్క కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్మోహన్రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో శివకార్తికేయన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
ఒక ఆర్టిస్ట్‌గా అన్ని చోట్లా సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించాలని, ప్రశంసలు అందుకోవాలని ఉంటుంది. నా వరకు కామెడీ సినిమాలు చేయడం, చూడటం చాలా ఇష్టం. నా స్నేహితుడి ద్వారా ఒకసారి అనుదీప్‌ని కలిశాను. ఆయన చెప్పిన లైన్ చాలా నచ్చింది. ఇదొక యూనివర్షల్ సబ్జెక్ట్. తెలుగు, తమిళ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. డైలాగ్స్, కామెడీ చాలా ఆర్గానిక్‌గా ఉంటాయి.
అనుదీప్ చేసిన 'జాతిరత్నాలు' చూశాను. అనుదీప్ రాసుకునే పాత్రల్లో స్వచ్చమైన అమాయకత్వం ఉంటుంది. పాత్రలు ఊహించని విధంగా రియాక్ట్ అవుతాయి.
ప్రిన్స్ స్టొరీ ఐడియా నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. ఒక ఇండియన్ బ్రిటీష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరిలో మనుషుల మైండ్ సెట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేమ,పెళ్లి విషయాల్లో వారిది ఒక ఖచ్చితమైన మైండ్ సెట్.
ఆ మైండ్ సెట్‌ని బ్రేక్ చేసే ఆలోచన చాలా ఆసక్తిగా అనిపించింది.
ఇందులో సత్యరాజ్ పాత్ర కూడా నన్ను ఎగ్జైట్ చేసింది. సత్యరాజ్ పాత్ర తన కొడుకుతో 'మన కులం, మతం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు' అని చెబుతుంది. చాలా యూనిక్ క్యారెక్టర్ ఇది.
'వరుణ్ డాక్టర్' సినిమాకి, ఈ సినిమాకి నా పాత్ర విషయంలో చాలా తేడా ఉంది. 'వరుణ్ డాక్టర్' డార్క్ కామెడీ. నిజానికి నిజ జీవితానికి పోలిక లేని సినిమా. నా పాత్రలో చిన్న స్మైల్, ఎమోషన్ కూడా ఉండదు. కానీ దాని నుండే హ్యూమర్ పండుతుంది. రియల్ లైఫ్‌లో అలా నవ్వకుండా ఒక్క అరగంట కూడా ఉండలేను. ప్రిన్స్ క్యారెక్టర్‌తో రిలేట్ చేసుకోగలను. అనుదీప్ తనదైన బాడీ లాంగ్వేజ్ డిజైన్ చేశారు. ప్రతి సీన్‌ని అనుదీప్ నటించి చూపించిన తర్వాతే యాక్ట్ చేసేవాడిని.
తొలిసారి తెలుగు సినిమా చేయడం ఒక సవాల్‌గా అనిపించింది. అనుదీప్ తెలుగులో రాశారు. తెలుగు స్క్రిప్ట్‌ని తమిళంలో చేయడం ఒక సవాల్‌గా తీసుకుని వర్క్ చేశాం. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. భవిష్యత్‌లో కూడా ద్విభాష చిత్రాలు చేయాలనే ఆలోచన ఉంది. విజరు, వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ - శంకర్ కలిసి పని చేస్తున్నారు. రెండు పరిశ్రమలు కలిసి సినిమాలు చేయడం చాలా మంచి పరిణామం.
'కేజీఎఫ్', 'ఆర్ఆర్ఆర్', 'విక్రమ్', 'కాంతార' చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. సౌత్ ఇండిస్టీ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉంది. రానున్న రోజుల్లో నా నుండి వైవిధ్యమైన సినిమాలు వస్తాయి. ఒక సైన్స్ ఫిక్షన్ చేస్తున్నాను. అలాగే ఒక ఫాంటసీ సినిమా కూడా ఉంది. అన్ని జోనర్స్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. మడోన్నే అశ్విన్‌తో 'మహావీరుడు' చేస్తున్నా. తెలుగులో ఏ దర్శకులతో కలిసి పని చేయాలని ఉందని అడిగితే, రాజమౌళితో అని చెబుతా. ఆయనతో కలిసి పని చేయాలని అందరికీ ఉంటుంది. అలాగే త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం.