Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో కార్తి, 'అభిమన్యుడు' దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా ఈనెల 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో విడుదల చేసిన ఈ చిత్రం దీపావళి బ్లాక్‌బస్టర్‌గా విజయం అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
హీరో కార్తి మాట్లాడుతూ,''ఖాకీ', 'ఖైధీ' చిత్రాల్లానే కొత్తగా చేస్తే తప్పకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు ఈ చిత్రంతో మరోసారి నిరూపించారు. పిఎస్ మిత్రన్ ఒక కొత్త కాన్సెప్ట్‌ని ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇది నేరుగా తెలుగులో చేసిన సినిమాలా అద్భుతంగా డైలాగులు రాశారు రాకేందుమౌళి. నాగార్జున అన్న సపోర్ట్‌ని మర్చిపోలేను' అని తెలిపారు. 'రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని విడుదల చేసినందుకు చాలా గర్వంగా ఉంది. కార్తి సినిమాని రిలీజ్ చేయడం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. కార్తి సినిమా అనగానే నాగార్జున మరో అలోచన లేకుండా విడుదల చేద్దామని చెప్పారు. సర్దార్ లాంటి మంచి సినిమా ఇచ్చిన కార్తి, మిత్రన్లకు కృతజ్ఞతలు' అని సుప్రియ అన్నారు.దర్శకుడు పిఎస్ మిత్రన్ మాట్లాడుతూ, 'నా తొలి చిత్రం 'అభిమన్యుడు' సినిమాని తెలుగు ప్రేక్షకులు విజయం చేశారు. ఇప్పుడు 'సర్దార్'కి మరో ఘన విజయం ఇచ్చారు. కార్తిగారు ఈ సినిమా చేయడం నా అదృష్టం' అని చెప్పారు.