Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గురువారం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
'యశోద' ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. ''యశోద' టీజర్లో సమంత గర్భవతి అని చూపించారు. ట్రైలర్లో డబ్బు కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళ అని స్పష్టం చేశారు. అంటే 'యశోద'ది సరోగసీ ప్రెగెన్సీ అన్నమాట! అక్కడితో కథ అయిపోలేదు. సరోగసీ కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళలను ఒక్కచోట చేర్చడం... ఆ తర్వాత అక్కడ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని కలిగించారు. సరోగసీ కోసం తీసుకొచ్చిన మహిళలకు ఏం జరుగుతోంది?, ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న 122 మంది సంపన్న మహిళల పేర్లు బయటకు రావడానికి, సరోగసీ ప్రెగెన్సీ ధరించిన మహిళలకు సంబంధం ఏమిటి?, ప్లాన్ ప్రకారం ఎవరి హత్య జరిగింది? అని ప్రేక్షకులు ఆలోచించేలా ట్రైలర్ కట్ చేశారు. 'యశోద'లో తల్లి ప్రేమ ఉంది. సమంతకు, డాక్టర్ రోల్ చేసిన ఉన్ని ముకుందన్ మధ్య లవ్ ట్రాక్ ఉందని హింట్ కూడా ఇచ్చారు. అంతే కాదు... ఇందులో క్రైమ్, రాజకీయం ఉంది, అన్నిటి కంటే ముఖ్యంగా మహిళ చేసే పోరాటం ఉంది. న్యూ ఏజ్ కాన్సెప్ట్‌తో సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది' అని చిత్ర బృందం తెలిపింది.
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, 'విజయ్ దేవరకొండ, సూర్య, రక్షిత్ శెట్టి, దుల్కర్ సల్మాన్, వరుణ్ ధావన్... మా ట్రైలర్‌ని విడుదల చేసినందుకు థ్యాంక్స్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ... అన్ని భాషల ప్రేక్షకుల నుంచి థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. విడుదలైన కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. సమంత నటన, కాన్సెప్ట్, మణిశర్మ నేపథ్య సంగీతం గురించి అందరూ మాట్లాడుతున్నారు. సినిమా కాన్సెప్ట్ ఏంటనేది మేం ముందుగా చెప్పేశాం. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు కాన్సెప్ట్ తెలిసినప్పటికీ... నెక్స్ట్ ఏం జరుగుతుంది? అని ఉత్కంఠ కలిగించే విధంగా కథ, కథనాలు ఉంటాయి. ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తాం' అని చెప్పారు.