Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''జీవితంలో ఏ రోజు ఎలా ఉన్నా, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా, మనం వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి.
మన ధైర్యం ఏమిటో నిరూపించుకోవాలి' అని నాకు
మా స్నేహితులు చెప్పారు. ఆ మాటలను నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నా. అందుకే ఈనెల 11న మీ ముందుకు రానున్న 'యశోద' సినిమా ప్రమోషన్స్‌లో నేను పాల్గొంటా' అని
కథానాయిక సమంత తెలిపారు.
మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల సమంత సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. సమంతకి ఆరోగ్యం బాగాలేదనే విషయం తెలిసి ఆమె అభిమానులతో పాటు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు పెట్టారు.
ఈ నేపథ్యంలో సమంత సోమవారం సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు.
''యశోద.. ట్రైలర్‌కు మీ స్పందన చాలా బాగుంది. జీవితం ముగింపులేని సవాళ్ళను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నా. కానీ, నేను అనుకున్న దాని కంటే ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. అన్నిసార్లూ బలంగా ముందుకు వెళ్ళలేమని నాకు అర్థమైంది. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. అలాంటి పరిస్థితులను ఇంకొక్క రోజు కూడా భరించలేనేమో అనుకున్న సందర్భాలున్నాయి. కానీ, ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది' అని సమంత ట్వీట్లో పేర్కొన్నారు.
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.