Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్ మెంట్స్, సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ)తో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'సార్'. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పకునిగా వ్యవహరిస్తోంది. సంయుక్త మీనన్ కథానాయిక.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం 'సార్' (తెలుగు) 'వాతి' (తమిళం) నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా, మరోవైపు చిత్ర పాటల ప్రచార పర్వం వైపు అడుగు వేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే చిత్రంలోని తొలి పాటను గురువారం రిలీజ్ చేశారు.
'మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు' అంటూ సాగే ఈ గీతానికి తమిళంలో ధనుష్, తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించటం విశేషం. జి.వి. ప్రకాష్ స్వరాలు, శ్వేతామోహన్ స్వరం పోటీ పడ్డాయనిపిస్తింది.
పాట చిత్రీకరణ కూడా అంతే. నాయిక, నాయికల భావోద్వేగాలు, కనిపించే దృశ్యాలు, వారి అభినయం వీక్షకుల మనసును హత్తుకుం టాయి. కళాశాల నేపథ్యంలో శేఖర్ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరించుకున్న ఈ పాట కథానుసారం కథానాయకుడు ధనుష్ ప్రవర్తన, ఆయన మంచి మనస్తత్వం, గొప్పతనం గుర్తెరిగిన నాయిక సంయుక్త మీనన్ మనసు ప్రేమైక భావనకు గురైన సందర్భం. ఆ ఊహల్లో, అలాంటి నేపథ్యంలో వచ్చే పాట ఇది. ఈ పాటలో నాయకానాయికలు, విద్యార్థులు కనిపిస్తారు. సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ కుమార్ స్వర పరిచిన బాణీలు సంగీత ప్రియుల్ని మధురమైన భావనకు గురిచేస్తాయి అంటున్నారు ఈ పాట రచయిత రామజోగయ్య శాస్త్రి.
ఈ పాట గురించి ఆయన మాట్లాడుతూ, 'ఇది అచ్చ తెలుగు పాట, ఓ అందమైన పాట, మంచి పాట, ప్రయోజనం ఉన్న పాట, ఉపయోగం ఉన్న పాట, సున్నితమైన భావోద్వేగాలు కలిగిన పాట. ఈ పాట రాయటానికి కొంత కష్ట పడినప్పటికీ, దర్శకుడు వెంకీ చెప్పిన పాట సందర్భం, ఆయన ఆలోచనలు అన్నీ చక్కని సాహిత్యం సమకూర్చటానికి నన్ను ముందుకు నడిపాయి. ఈ పాటకు ఇటు నేను, అటు తమిళంలో ధనుష్ సాహిత్యం అందించటం కొత్త అనుభూతి. భావం ఒక్కటే అయినా శైలి భిన్నంగా ఉంటుంది. జి.వి ప్రకాష్ బాణీల్లో మరింతగా ఒదిగిన సాహిత్యం ఉన్న పాట ఇది. గాయని శ్వేతా మోహన్ గాత్రం పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తుంది. చాట్ బస్టర్స్లో నిలిచే పాట ఇది. అవకాశం ఇచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్యకు కృతజ్ఞతలు' అని తెలిపారు.
విద్యావ్యవస్థ తీరు తెన్నులపై హీరో సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు 'సార్' జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్నది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగతకు గురి చేస్తుందని, సినిమా కచ్చితంగా అందర్నీ అలరిస్తుందని చిత్ర నిర్మాతలు చెప్పారు.