Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రా దేవానంద్..
ఆంధ్రా జేమ్స్‌బాండ్..
ఆంధ్రా కౌబాయ్..
డేరింగ్ అండ్ డాషింగ్ హీరో..
వెండితెర విప్లవజ్యోతి..
సూపర్‌స్టార్..
సాహసలకు, ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచి సాంకేతికంగా తెలుగు సినిమా దిశని, దశని మార్చిన హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో నటశేఖర కృష్ణ సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అజాతశత్రువుగా పేరొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి సూపర్‌స్టార్ కృష్ణ జీవిత ప్రస్థానం గురించి...
కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. 1942 మే 31న గుంటూరుజిల్లాలోని బుర్రిపాలెంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పట్నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. ఏలూరులో కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావుకి జరిగిన ఘన సన్మానాన్ని చూసి, ఆయన స్ఫూర్తితో తాను కూడా అంతటివాడ్ని అవ్వాలని సినీ రంగంలోకి రావాలని నిశ్చయించుకున్నారు.
తొలుత ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో పలు నాటకాల్లో నటించి నటనపై అవగాహన పెంచుకున్నారు. తర్వాత 'కులగోత్రాలు', 'పదండిముందుకు', 'పరువు ప్రతిష్ట' వంటి తదితర చిత్రాల్లో చిన్న పాత్రలు వేశారు. 1964లో దర్శక, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు 'తేనె మనసులు' సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. 1965లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో కెరీర్ పరంగా కృష్ణ వెనుదిగిరి చూసుకోలేదు.
రెండో సినిమా 'కన్నెమనసుల్లో' నటిస్తుండగానే 'గూఢచారి 116'లో నటించే అవకాశం కృష్ణకు లభించింది. ఈ సినిమా కూడా అఖండ విజయం సాధించి ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా ఇమేజ్ దక్కించుకున్న ఆయన ఏకంగా 20 సినిమాల్లో హీరోగా ఎంపికయ్యారు.
బాపు తీసిన పూర్తి అవుట్డోర్ చిత్రం 'సాక్షి'. విజయనిర్మలతో నటించిన తొలి చిత్రం కూడా ఇదే. ఈ సినిమా సాధించిన విజయంతో ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. ఆయన ఏకంగా మూడు షిప్టుల్లో పని చేస్తూ రోజూ మూడు సినిమాల్లో నటించారు. దీంతో 1968లో 10 సినిమాలు, 1969లో 15, 1970లో 16, 1971లో 11, 1972లో 18, 1973లో 15, 1974లో 13, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. సంవత్సర కాలంలో ఓ హీరోకి సంబంధించి ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిన రికార్డ్ కృష్ణదే కావడం విశేషం.
సోలో హీరోగానే కాకుండా దాదాపు 80 మల్టీస్టారర్ చిత్రాల్లో నటించి కృష్ణ రికార్డ్ సృష్టించారు. అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్‌తో 'స్త్రీ జన్మ', 'నిలువు దోపిడీ', 'విచిత్ర కుటుంబం', 'దేవుడు చేసిన మనుషులు', 'వయ్యారి భామలు- వగలమారి భర్తలు', ఇక తనకి స్ఫూర్తినిచ్చిన కథానాయకుడు ఏఎన్నార్‌తో 'మంచి కుటుంబం', 'అక్కాచెల్లెలు', 'హేమాహేమీలు', 'గురుశిష్యులు', 'ఊరంతా సంక్రాంతి', 'రాజకీయ చదరంగం' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. అలాగే కృష్ణంరాజుతో 19, శోభన్‌బాబుతో 13, మోహన్‌బాబుతో 4, కాంతారావుతో 3, శివాజీ గణేశన్‌తో 3, రజనీకాంత్‌తో 3, సుమన్‌తో 3, నాగార్జునతో 2, చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్, హరికృష్ణ, రవితేజలతో ఒక్కో సినిమా చేశారు. ఇక తన తనయులు రమేష్‌బాబుతో 5, మహేష్‌బాబుతో 7 చిత్రాల్లో కనిపించారు. వీటిల్లో 'ముగ్గురు కొడుకులు' చిత్రంలో కృష్ణ, ఆయన తనయులు మహేష్‌బాబు, రమేష్‌బాబుతో కలిసి నటించడం ఓ విశేషమైతే, తన తల్లి నాగరత్నమ్మ కోరిక మేరకు కృష్ణ ఈ సినిమాని నిర్మించడం మరో ప్రత్యేకత.
విజయనిర్మలతో 48 చిత్రాలు, జయప్రదతో 47, శ్రీదేవితో 31 చిత్రాల్లో నటించి అత్యధిక చిత్రాల నాయక నాయికల రికార్డ్ సృష్టించిన ఘనతా ఆయనదే. తొమ్మిదేళ్ళలో 100 సినిమాల్లో నటించిన ఎవర్గ్రీన్ రికార్డూ కృష్ణకే సొంతం. అలాగే దాదాపు 105 మంది దర్శకులతో, 52 మంది సంగీత దర్శకులతో పని చేసిన అరుదైన రికార్డ్ కూడా కృష్ణకే సొంతం. ఇక సతీమణి విజయనిర్మల దర్శకత్వంలో రూపొందిన 50 చిత్రాల్లో కృష్ణ నటించడం కూడా రికార్డే. చాలా మంది నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారు. రీమేక్ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఘనత కూడా కృష్ణదే. ఆయన మొత్తం 54 రీమేక్ చిత్రాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇందులో హిందీ రీమేక్ చిత్రాలు 17 ఉన్నాయి.
ఓ సినిమా ప్లాప్ అయితే సదరు నిర్మాతకు మళ్ళీ డేట్స్ ఇచ్చేవారు. అలాగే పరాజయం పొందిన సినిమాలను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లను, ప్రదర్శించిన ఎగ్జిబిటర్లను ఆదుకున్న సందర్భాలు కోకొల్లలు. అందుకే ఆయన్ని నిర్మాతల మనిషి అంటుంటారు. 2008లో ఆంధ్రయూనివర్సిటీ 'గౌరవ డాక్టరేట్'తో ఆయన్ని ఘనంగా సత్కరించింది. కేంద్రప్రభుత్వం 2009లో 'పద్మభూషణ్' పురస్కారాన్ని అందించింది. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌గా ఎన్నికయ్యారు. 1972లో ఆయన నటించిన 'పండంటి కాపురం' చిత్రం ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఎంపికై నేషనల్ అవార్డుని కూడా కైవసం చేసుకుంది. 'అల్లూరి సీతారామరాజు' పాత్రకు నంది బహుమతి లభించింది. ఇందిరాదేవిని కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి రమేష్‌బాబు, మహేష్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం. ఆ తర్వాత నటి, దర్శకురాలు విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.
తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబారు సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70ఎంఎం సినిమా (సింహాసనం), తొలి డీటీఎస్ సినిమా (తెలుగు వీర లేవరా), తొలి ఈస్ట్‌మన్ కలర్ సినిమా (ఈనాడు) వంటి భిన్న జోనర్స్లో నటించడంతోపాటు తెలుగు సినిమాకు నూతన సాంకేతికతను పరిచయం చేసిన ఘనత కూడా కృష్ణదే. 2016లో విడుదలైన 'శ్రీశ్రీ' ఆయన నటించిన చివరి చిత్రం.
ఐదు దశాబ్దాల పాటు సాగిన సినీ కెరీర్లో దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించారు. ఈ సినీ ప్రస్థానంలో ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేసి 'డేరింగ్ అండ్ డాషింగ్' హీరోగా పేరు తెచ్చుకున్నారు. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అలాగే 16 సినిమాలను దర్శకుడిగానూ తెరకెక్కించారు.