Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనం సమస్యల పరిష్కారం కోసం రగులుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధానంగా చేసుకుని 'ఉక్కు సత్యాగ్రహం' పేరుతో సత్యారెడ్డి ఓ సినిమా తీస్తున్నారు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సత్యారెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం గద్దర్ రచించి, పాడిన 'సమ్మె నీ జన్మహక్కురన్నో'' అంటూ సాగే లిరికల్ వీడియో పాటను మేడే సందర్భంగా గద్దర్ విడుదల చేసారు. ఈ పాటను సత్యా రెడ్డి, ఇతర ఆర్టిస్టులతో పాటు గద్దర్‌పై కూడా చిత్రీకరించారు. తాజాగా సుద్దాల అశోక్ తేజ రచించిన పాటను రిలీజ్ చేసింది చిత్రబందం. ఈ ఈవెంట్లో గద్దర్, సత్యారెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకుడు త్రినాథ్ రావ్ నక్కిన, ఆర్.నారాయణమూర్తి తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, 'విశాఖ ఉక్కు - ఆంధ్రులు హక్కు అని నినాదాలు చేస్తుంటే, దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం న్యాయమా.? కాదు అని ప్రశ్నిస్తూ సినిమా తీసాడు సత్యారెడ్డి. .కళాకారుడు ప్రశ్నించాలి. అలా ప్రశ్నిస్తున్నాడు సత్యారెడ్డి. ప్రైవేటీకరణ ఆపమంటూ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను' అని అన్నారు.'ఈ సమస్య కేవలం విశాఖపట్నం ప్రజలు మాత్రమే కాదు. మన తెలుగు ప్రజలందరిది. మొత్తం తెలుగు ప్రజలందరూ ఏకమవ్వాలని పిలిపునిస్తున్నాను. అందరు కలిసి ఈ ప్రైవేటీకరణను ఆపగలరని నమ్ముతున్నాను' అని గద్దర్ చెప్పారు.