Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 2 ది సెకండ్ కేస్'. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమాపై శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మాతగా రూపొందిన చిత్రమిది. మీనాక్షి చౌదరి హీరోయిన్. డిసెంబర్ 2న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ''హిట్' అనేది సినిమాలా కాకుండా ఫ్రాంచైజీగా తయారు చేసిన నాని, ప్రశాంతి, శైలేష్‌లకు కంగ్రాట్స్. అదంత ఈజీ కాదు.. హిట్ సినిమా చేయొచ్చు కానీ.. ఫ్రాంచైజీ చాలా కష్టం. సాధారణంగా హీరోకో, దర్శకుడికో ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఓ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండటం అనేది ఇండియాలోనే ఫస్ట్ టైమ్ అని అనుకుంటున్నాను. అలాంటి గొప్ప ఫ్రాంచైజీ చేసినందుకు టీమ్‌కు అభినందనలు. 'హిట్ 1'లో చేసిన విశ్వక్ సేన్, 'హిట్ 2'లో చేసిన అడివి శేష్ ఓ ఎనర్జీని తీసుకొచ్చారు. 'హిట్ 2' ట్రైలర్ చూశాను. చాలా బాగా నచ్చింది. ట్రైలర్ చూస్తుంటేనే సినిమాలోని హత్యలను చేసే హంతకుడెవరు.. వెంటనే సినిమా చూడాలనిపించింది. ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. అందులో డౌటే అక్కర్లేదు. హిట్ 3, హిట్ 4, హిట్ 5 వరుసగా వస్తాయి. అందులో డౌట్ లేదు. అయితే ప్రతి సినిమా ఒకే సమయంలో రావాలి. అది హిట్ సీజన్ కావాలి. అది జనాలకు అర్థం కావాలి. సేమ్ డేట్, సేమ్ వీక్ రావాలి. తెలుగు సినిమా నుంచి వస్తున్న మరో క్వాలిటీ సినిమా ఇది' అని తెలిపారు.
'శైలేష్ రాసుకున్న హిట్ యూనివర్స్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. 'హిట్ 3'లో కూడా ఉంటానని అనటం చాలా సంతోషంగా ఉంది. నా గత చిత్రాలను ఏ నమ్మకంతో అయితే చూడటానికి వచ్చారో అదే నమ్మకంతో నేను ఈ సినిమాను చూసి ఎంజారు చేశాను. సినిమా చూసిన తర్వాత దీన్ని హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం' అని హీరో అడివి శేష్ అన్నారు.
నాని మాట్లాడుతూ, 'ఈ సినిమా మీద అందరి ప్రేమ, గౌరవం ఎలా ఉందో చూసే ఉంటారు. అదే ప్రేమ, రెస్పెక్ట్‌తో హిట్ సినిమాను చేశాం. ప్రపంచమంతా తిరిగిన రాజమౌళిగారు రాలేనని చెప్పొచ్చు. కానీ ఈవెంట్‌కు రావాలనగానే వచ్చారు. సొంత బ్యానర్‌లా ఫీల్ అవుతారాయన. ఆయన ఈ వేడుకకి రావటం గౌరవంగా భావిస్తున్నాం. శేష్ టెర్రిఫిక్ యాక్టర్. ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌ని తక్కువ వేయకుండా నటించే ఓ యాక్టర్ తను. అలాంటి ఓ యాక్టర్‌కి శైలేష్‌లాంటి ఓ డైరెక్టర్ కలిసినప్పుడు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీని తర్వాత హిట్ 3... నుంచి 7 వరకు ఉంటుంది. హిట్ 7లో అందరినీ కలుపుతానని శైలేష్ ఇప్పటికే చెప్పేశాడు' అని అన్నారు.