Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా కిరాణాషాపు యజమానులు కూడా విశేష సేవలందించారు. కానీ సమాజం వారిని గుర్తించలేకపోయింది. ఒక కిరాణా షాపు వ్యక్తి నేపథ్యంలో 'నమస్తే సేట్జీ' సినిమాను నిర్మించామని చిత్ర హీరో, దర్శకులు తల్లాడ సాయికృష్ణ తెలిపారు.
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమా ఈ నెల 7న విడుదల కానుంది. ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా మంగళవారం ఈచిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మహంకాళీ దివాకర్‌లు ముఖ్య అతిథులుగా హాజరై వీడియో సాంగ్, ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ,'కరోనా సమయంలో నన్ను కలచి వేసిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో తీశాను. కరోనా ఆంక్షలున్న సమయంలో మారుమూల గ్రామాల్లో కిరాణా షాపు యజమానులు అందించిన సహకారం ఎనలేనిది. ఈ సినిమాలో మాట్లాడే కెమెరా అనే కనిపించని క్యారెక్టర్ ఉందని, సినిమా చూసి ఆ కెమెరా పేరును తెలిపిన మొదటి పది మందికి ఒక్కొక్కరికీ పది వేల విలువ చేసే బహుమతులు అందిస్తాం' అని చెప్పారు. 'సహజత్వంతో కూడిన వినూత్న కథాంశంతో ఈ సినిమా నిర్మాణం జరిగింది. మంచి సందేశాత్మక చిత్రం కూడా' అని హీరోయిన్ స్వప్నా చౌదరి అమ్మినేని అన్నారు.
నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, 'ఈ మధ్య కుటుంబ సమేతంగా చూసే సినిమాలు రావట్లేదు. మా చిత్రాన్ని ఇంటిల్లిపాదీ అందరూ చూడొచ్చు. ప్రతీ కిరాణా షాపు వ్యక్తి ఈ సినిమా తప్పక చూడాలని కోరుకుంటున్నారు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయాన్ని వారి సేవలకే అంకితం చేస్తాం' అని తెలిపారు.