Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1996లో విడుదలైన 'ప్రేమదేశం' సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. చాలా కాలం తర్వాత అదే టైటిల్‌తో వస్తున్న చిత్రం 'ప్రేమదేశం'. ఈ చిత్రాన్ని సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించగా, శిరీష సిద్ధమ్ నిర్మించారు. రఘు కళ్యాణ్ రెడ్డి, రాము అసోసియేట్ ప్రొడ్యూసర్స్‌గా, కమల్, కిరణ్, రూపా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా ఉన్న ఈ చిత్రంలో అలనాటి అందాలతార మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర నటించిన ఈ చిత్రం ఈనెల 3న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డైరెక్టర్ శైలేష్ కొలను, మధుబాల తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మధుబాల మాట్లాడుతూ,'డైరెక్టర్ శ్రీకాంత్ సిద్ధం చెప్పిన ఈ సినిమా లైన్ నచ్చి చేశాను. ఆ తరువాత టీజర్ రిలీజ్ చేసినప్పుడు నా ఫేస్ చూసుకుని చాలా బాగా చేశారు అనిపించింది. ఇందులో మణిశర్మ ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్, పాటలు చాలా బాగున్నాయి' అని తెలిపారు. 'మా సినిమా ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుండి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషం కలిగింది. ఈ విషయంలో నేను ముఖ్యంగా మణిశర్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. 'పదములే లేవు పిల్ల' వంటి తదితర బ్యూటిఫుల్ సాంగ్స్ ఇవ్వడం ఓ ఎత్తు అయితే ఇందులో మధుబాల నటిస్తుండడం మరో ఎత్తు. దాంతో మా సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది.మా సిస్టర్ శిరీష ఎంతో కష్టపడి ఈ సినిమాకు సహకారం అందించింది' అని దర్శకుడు శ్రీకాంత్ సిద్ధం చెప్పారు.
ప్రొడ్యూసర్ శిరీష సిద్ధం మాట్లాడుతూ,'నేనొక సాప్ట్‌వేర్ ఎంప్లాయిని. మా అన్నయ్య శ్రీకాంత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మూవీ కూడా చాలా బాగా వచ్చింది. ఫ్రెష్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ మూవీని చూసి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఎమోషన్‌తో బయటకు వస్తారు' అని అన్నారు. 'ఈ సినిమాలో రెండు లవ్ స్టోరీస్ ఉన్నాయి. నాలుగు కోట్ల బడ్జెట్ అని స్టార్ట్ చేసిన సినిమా కాస్త 8 కోట్లు అయ్యింది. అయినా మేము క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాం' అని అసోసియేట్ ప్రొడ్యూసర్స్ రఘు కళ్యాణ్ రెడ్డి, రాము తెలిపారు.