Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ దర్శకుడు సాగర్ (70) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో పుట్టిన సాగర్ అసలు పేరు విద్యాసాగర్ రెడ్డి. చదువుకుంది చెన్నైలో. చదువులో అంత చురుకైనవాడు కాదు. ఎట్టకేలకు ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు. అయితే సినిమాపై ఉన్న ఆసక్తిని గమనించిన వాళ్ళ అమ్మగారు ఆయన్ని ఓ అసిస్టెంట్ ఎడిటర్ దగ్గర జాయిన్ చేస్తే, మీ అబ్బాయి ఈ ఇండిస్టీకి పనికి రాడు అని చెప్పాడు. దీంతో ఆమెకు కొడుకు విషయంలో బెంగపట్టుకుంది. అయితే ఆయన మాటల్ని మాత్రం సాగర్ సీరియస్‌గా తీసుకుని సినిమాల్లో ఎలాగైనా రాణించాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా 1969లో శ్రీహరి దగ్గర ఎడిటింగ్ అసిస్టెంట్‌గా చేరారు. ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 20 సినిమాలకు పని చేశారు. తర్వాత 'మహ్మద్‌బీన్ తుగ్గక్' చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన ఆయన నరేష్, విజయశాంతి ప్రధాన తారాగణంగా 'రాకాసి లోయ' చిత్రాన్ని తెరకెక్కించారు. అది మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సుమన్, భానుచందర్‌తో 'డాకు' తీశారు. అది కూడా మంచి సక్సెస్ సాధించడంతో సాగర్ని అందరూ యాక్షన్ డైరెక్టర్ అని పిలవడం స్టార్ట్ చేశారు.
ఆ తర్వాత 'అమ్మదొంగ', 'ఖైదీబ్రదర్స్', 'స్టూవర్ట్‌పురం దొంగలు', 'రామసక్కనోడు', 'యాక్షన్ నెం.1', 'ఓసి నా మరదలా' వంటి తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించి, పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం పరిశ్రమలో అగ్రస్థాయి దర్శకులుగా పేరొందిన వి.వి.వినాయక్, శ్రీనువైట్ల, జి.నాగేశ్వరరెడ్డి, రవికుమార్ చౌదరి వంటి వాళ్ళంతా సాగర్ శిష్యులే కావడం విశేషం. అలాగే మూడుసార్లు ఆయన తెలుగు దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగానూ సేవలు అందించారు. అగ్ర దర్శకుడిగానే కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగానూ పేరొందిన సాగర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.