Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంస్కృతి, సంప్రదాయం..
సభ్యత, సంస్కారం..
సంగీతం, సాహిత్యం, నాట్యం..
సమాజం.. సమస్యలు..
ఇవే..
కళాతపస్వి కె. విశ్వనాథ్ సినిమా కథల ఇతివృత్తాలకు మూలాలు. స్టార్లు, కాంబినేషన్లు, ఫక్తు ఫార్మాలా కథలతో మూసధోరణిలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా గమనాన్ని మార్చిన ఆయన ఆయుధాలు కూడా ఇవే. ఖాకీ డ్రస్‌తో కళారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన క్రియేటివ్ కామ్రేడ్ కె.విశ్వనాథ్ సినీ జీవిత ప్రయాణంలో కొన్ని విశేషాలు..
కె.విశ్వనాథ్ అసలు పేరు కాశీనాథుని విశ్వనాథ్. వెండితెరపై విలువల్ని చాటిన విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పెద్దపులివర్రులో జన్మించారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం, తల్లి సరస్వతమ్మ.
గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ చదివిన ఆయన అదే ఊరిలోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో బీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం విజయవాహినీ సంస్థలో పని చేసేవారు. దాంతో డిగ్రీ పూర్తి కాగానే విజయవాహిని స్టూడియోలో సౌండ్‌రికార్డిస్ట్‌గా చేరారు. 'పాతాళభైరవి'కి అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పనిచేశారు.
ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్‌గా చేరారు. కొన్ని చిత్రాలకు కథారచనలో పాలు పంచుకున్నారు. అలా అన్నపూర్ణ సంస్థలో రాణిస్తున్న రోజుల్లోనే ఆ సంస్థ అధినేత అక్కినేనికి విశ్వనాథ్ పనితనం ఆకర్షించింది. 'ఆత్మగౌరవం' చిత్రంతో కె.విశ్వనాథ్‌ను దర్శకునిగా దుక్కిపాటి మధుసూదనరావు పరిచయం చేశారు.తొలి చిత్రంలోనే తనదైన బాణీని ప్రదర్శించారు విశ్వనాథ్.
నాటి మేటినటులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో చిత్రాలు రూపొందించారు. అప్పటి వర్ధమాన హీరోలు కష్ణ, శోభన్‌బాబుతోనూ మురిపించే సినిమాలు అందించారు. తన శైలి కథల ఎంపికతో శోభన్ బాబు, చంద్రమోహన్, కమల్‌హాసన్ వంటివారికి స్టార్డమ్ తీసుకొచ్చారు.
ఆయన దర్శకత్వం వహించిన శంకరాభరణం, సాగర సంగమం, శతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం వంటి చిత్రాలు కలెక్షన్ల వర్షంతో పాటు సమాజానికి ఎన్నో ప్రశ్నల్ని సంధించారు. కళలేగాక సామాజిక సమస్యలపై కూడా విశ్వనాథ్ ఎన్నో సినిమాలు రూపొందిం చారు. స్వాతిముత్యం, స్వయంకషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం ఈ కోవలోనివే.
ఇక కళాతపస్వి స్టార్ల ఇమేజ్‌తో సంబంధం లేకుండా సినిమాలు తీశారు. ఏఎన్ఆర్ సూత్రధారులు, కమల్‌హాసన్ సాగరసంగమం-స్వాతిముత్యం, చిరంజీవి స్వయం కషి, బాలకష్ణ జనని జన్మభూమి, వెంకటేశ్ స్వర్ణ కమలం, రాజశేఖర్ శతిలయలు వంటి సినిమాలతో స్టార్ హీరోలతో ప్రయోగాలు చేసి కూడా హిట్లు కొట్టొచ్చు అని నిరూపించారు.
50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమాకు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు. తెలుగులోనే కాకుండా హిందీలో పదికి పైగా చిత్రాలను తెరకెక్కించారు. కమల్‌హాసన్, బాలసుబ్రమణ్యం చొరవతో నటుడిగా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు.
శుభసంకల్పం, నరసింహానాయుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్ఫెక్ట్, కలిసుందాం రా..' వంటి దాదాపు 20కిపైగా సినిమాల్లో నటించారు. తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా కీలక పాత్రలు పోషించి మెప్పించారు. తెలుగులో ఆయన నటించిన చివరి చిత్రం 'హైపర్'.
కళా తపస్విగా సినిమా రంగానికి చేసిన కషికి 1992లో రఘుపతి వెంకయ్య అవార్డును, అదే ఏడాది పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అలాగే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ దక్కించుకున్నారు.
జాతీయ ఉత్తమ చిత్రాలుగా 'శంకరాభరణం', 'సప్తపది', 'సాగరసంగమం', 'స్వాతిముత్యం', 'శృతిలయలు', 'స్వరాభిషేకం' నిలిచాయి. వీటిల్లో సప్తపది నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా చిత్రంగా అవార్డు అందుకోవడం విశేషం.
అలాగే 'శంకరాభరణం', 'సప్తపది', 'శుభలేఖ', 'స్వాతిముత్యం', 'శృతిలయలు' వంటి తదితర చిత్రాలకు ఉత్తమ రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా నంది అవార్డులను అందుకున్నారు. ఇక నటుడిగా 'శుభసంకల్పం', 'కలిసుందాంరా' చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందారు.
సినిమా సెట్లో కార్మికుడిలా కళాతపస్వి ఖాకీ దుస్తులు ధరించడానికి కారణం డైరెక్టర్ అనే హోదాతో విర్రవీగకుండా అందరూ ఒక్కటే అని చాటారు. ఆయన మరణం చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు. మరణానికి కొన్ని క్షణాల ముందు పాట రాస్తూ.. ఇక రాయలేక దానిని కుమారుడి చేతికందించి కుప్పకూలిపోయారు.
తెలుగు సినిమాను శిఖరంపై నిలబెట్టిన 'శంకరాభరణం' విడుదలైన ఫిబ్రవరి 2నే కళాతపస్వి కన్నుమూయడం యాదృచ్ఛికమే కాదు.. క్రియేటీవ్ క్రామేడ్గా కె.విశ్వనాథ్ తెలుగు చిత్ర పరిశ్రమలో స్వర్ణయుగాన్ని క్రియేట్ చేశారనేది కూడా వాస్తవం.
విశ్వనాథ్ సినిమాల్లోని సంగీతం, సాహిత్యం ఇప్పటి తరానికి కూడా శ్రావ్యంగా వీనుల విందు చేస్తోంది. కాలాన్ని, మారుతున్న అభిరుచుల్ని తట్టుకొని శంకరాభరణం ఇప్పటికీ ఒక గొప్ప సినిమాగా ప్రజాదరణ పొందింది. శంకరాభరణం, సాగర సంగమం సినిమాల మధ్య విశ్వనాథ్ కొన్ని సాంఘిక సమస్యల మీద, కుల కట్టుబాట్ల మీద సప్తపది, కట్న దురాచారం మీద శుభలేఖలతో పాటు ఆత్మ ప్రబోధంతో తనను తాను తెలుసుకునే సామాన్యుడి కథతో శుభోదయం సినిమాలు తీసారు. అలాగే ఒక కళాకారుడి ఆత్మ సంఘర్షణను, అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సాగర సంగమం, స్వాతి ముత్యం, శతిలయలు, స్వర్ణ కమలం చిత్రాలను తెరకెక్కించారు. సాంఘిక సమస్యల మీద తీసిన స్వయం కషి, సూత్రధారులు తదితర సినిమాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టాయి. ముఖ్యంగా అణగారిన వర్గాలు, వారిని శాసించే వారిలోని పశుప్రవత్తిని 'సూత్రధారులు' చర్చించింది. ఇక ఆయన సినిమాల్లో మహిళల పాత్రకు పెద్ద పీటవేశారు. ముఖ్యంగా స్త్రీ శక్తిని చాటే రీతిలో ఆయన రూపొందించిన పాత్రలు వెండితెరపై విశ్వరూపం చూపాయి.