Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం 'సార్' (తెలుగు)/ 'వాతి'(తమిళం).
శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.
ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ఏఎంబీ సినిమాస్‌లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కథానాయకుడు ధనుష్ మాట్లాడుతూ, 'ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఇది నా మొదటి తెలుగు సినిమా. చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, హిందీ సినిమా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అనడం సంతోషించదగ్గ విషయం. ఈ కథ చాలా బాగుంటుంది. పేద విద్యార్థుల చదువు కోసం ఓ మాస్టారు చేసే పోరాటమే ఈ సినిమా. నాకు ఇంతమంచి సినిమా ఇచ్చినందుకు వెంకీ అట్లూరికి ధన్యవాదాలు. అలాగే చినబాబు, నాగవంశీకి, త్రివిక్రమ్‌కి, సంయుక్త మీనన్, హైపర్ ఆది, మా టీమ్ అందరికీ ధన్యవాదాలు' అని అన్నారు.
'లాక్డౌన్ సమయంలో ఈ కథ రాసుకుని, వంశీకి నెరేట్ చేస్తే, ఆయనకు నచ్చింది. లాక్ డౌన్ కావడంతో అప్పుడు హీరోలు పెద్దగా కథలు వినే ధైర్యం చేయలేదు. కానీ ధనుష్ మాత్రం కథ చెప్పడానికి రమ్మన్నారు. ఈ సినిమా ఆయన చేసినా, చేయకపోయినా ఆయనకు కథ చెప్పానన్న సంతృప్తి నాకు చాలు అనుకున్నాను. కానీ ఆయన కథ వినగానే ఈ సినిమా చేస్తున్నాను అనడంతో నాకు ఆ ఆనందంలో మాటలు రాలేదు. నాకు ఈ అవకాశమిచ్చిన వంశీకి, ధనుష్‌కి జీవితాంతం రుణపడి ఉంటాను. ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉంది' అని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు.
నాయిక సంయుక్త మీనన్ మాట్లాడుతూ,'ఇందులో ఓ మంచి పాత్ర పోషించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా అందరినీ అలరిస్తుంది' అని అన్నారు. ఈ వేడుకలో ఈ చిత్రంలో నటించిన స్టూడెంట్స్, టీమ్‌తో కలిసి 'మాస్టారు.... మాస్టారు' గీతాన్ని హీరో ధనుష్ ఆలపించడం విశేషం.