Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలు తెలుగు, కన్నడ చిత్రాలకు రచన చేసిన యడవల్లి వేంకట లక్ష్మీ నరసింహశాస్త్రి (వైవీఎల్ ఎన్ శాస్త్రి -75) అనారోగ్యంతో విజయవాడలో శనివారం రాత్రి కన్నుమూశారు. యడవల్లిగా ఆయన చిత్రసీమలో ప్రసిద్ధులు. వీరి స్వస్థలం నెల్లూరు. 'నక్షత్రాలు' వచన కవితా సంపుటి, 'విరిగిన కొమ్మకు విరిసిన మల్లెలు' నవలతో రచయితగా మంచి గుర్తింపు పొందారు.
ఆ తర్వాత నిర్మాత రాధాకృష్ణమూర్తి ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. మాదిరెడ్డి సులోచన రాసిన 'తరం మారింది' అనే నవలను అదే పేరుతో రాధాకృష్ణమూర్తి తీసిన సినిమాకు తగిన విధంగా భాషను, యాసనూ సమకూర్చడానికి యడవల్లి సాయం చేశారు. అందుకోసం చెన్నై వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, కమలాకర కామేశ్వరరావు, విక్టరీ మధుసూదనరావుతో పని చేసే అవకాశం ఆయనకు దక్కింది. నటీ లక్ష్మి యడవల్లిని కన్నడ సినీపరిశ్రమకు పరిచయం చేశారు. అప్పటి నుండీ తెలుగు సినిమాలతో పాటు కన్నడ చిత్రాలకు సైతం పని చేస్తూ ఉన్నారు. దాదాపు పదిహేను కన్నడ సినిమాలకు రచన చేశారు. ఓ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'తెలుగు సినిమాల్లో హాస్యం', 'తెలుగు సినీ దర్శక మాలిక - విజయ వీచిక', 'తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు' పుస్తకాలను రచించారు. పలు టీవీ సీరియల్స్‌కు, కథలు - మాటలు సమకూర్చారు. యడవల్లి కేంద్ర సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్సీ) సభ్యునిగా, లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్‌గా సేవలు అందించారు. యడవల్లి అంత్యక్రియలు ఆదివారం ఉదయం విజయవాడలో ముగిశాయని ఆయన సోదరుడు నాగేశ్వరరావు తెలిపారు. యడవల్లి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.