Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా ఇళయరాజా లైవ్ కాన్సార్ట్
సినీ సంగీత ప్రపంచంలో స్వరమాంత్రికుడు ఇళయరాజాది ఓ ప్రత్యేక స్థానమని వేరే చెప్పక్కర్లేదు. మాస్ట్రో ఇళయరాజా అరుదైన పాటల వేడుకకి హైదరాబాద్ మరోసారి వేదిక కావడం విశేషం. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇళయరాజా లైవ్ షో సంగీత ప్రియులను, ఆయన అభిమానులను విశేషంగా అలరించింది.
అగ్రకథానాయకుడు చిరంజీవి వాయిస్ ఓవర్ ఈ లైవ్ షోకి మరింత వన్నె తీసుకొచ్చింది. 'జననీ జననీ..' పాటతో మొదలైన ఈ మ్యూజికల్ ట్రీట్ ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తిక్ పాడిన 'ఓం శివోహం' పాట ప్రేక్షకుల్లో గొప్ప ఉత్సాహాన్ని తెచ్చింది. 'ఎన్నో రాత్రులోస్తాయిగానీ, మాటే మంత్రము, కలయా నిజమా' పాటలను ఇళయరాజా స్వయంగా ఆలపించి అలరించారు.
ఈ లైవ్ షోలో దాదాపు 35 పాటలు అలపించగా రీటేకులు, అపశ్రుతులు దొర్లకుండా లైవ్ షోని కండక్ట్ చేయడంలో ఇళయరాజా మరోసారి తన మార్క్ చూపించారు. మనో, ఎస్పీ చరణ్ .. బాలు లేని లోటుని తీర్చడానికి తమ శక్తి మేరకు ప్రయత్నించగా కార్తిక్, శరత్ తమదైన గాత్రంతో ఆకట్టుకున్నారు. చివర్లో 'సింగారాల పైరుల్లోన' పాట స్టేడియంని సందడిగా మార్చేసింది. ఫిమేల్ సింగర్స్ విభావరి, శ్వేత, సునీత, శీరిష, అనిత తమ గాన మాధుర్యంతో అలరించారు. ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఏళ్ళు గడుస్తున్నా అందులో ఉన్న ఫ్రెష్ నెస్ కొంచెం కూడా తగ్గకపోగా, ఎన్ని సార్లు విన్నా అదే ఎమోషన్ కనెక్ట్ అవుతుంది అందుకేనేమో ఆయన్ని మ్యూజికల్ గాడ్ అంటారు.
ఒక పాట తయారీ వెనుక ఎలాంటి శ్రమ ఉంటుంది?, ఎంత సజన అవసరమో 'ఓ ప్రియ ప్రియ..' పాటలో వచ్చే ఒక ఇంట్రడక్షన్‌తో ప్రేక్షకులకు వివరించారు రాజా. ఎన్ని లేయర్లలో వర్క్ జరుగుతుందో చెప్పి.. ఇలా సంగీతాన్ని ప్రేక్షకులకు చెప్పే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా ? అని ప్రశ్నించి.. 'ఎవరు లేరు..నేను మాత్రమే ఇలా చెప్తాను' అని ఇచ్చిన సమాధానంతో మైదానంలో చప్పట్లు మారుమ్రోగాయి. ఈ లైవ్ షోలో కళాతపస్వి కె. విశ్వనాథ్‌కి అంజలి ఘటించారు ఇళయరాజా. 'సాగరసంగమం, స్వాతి ముత్య'ంలోని పాటలతో కె.విశ్వనాథ్‌కి ఘన నివాళి అర్పించారు.