Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. గత కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని స్వగృహంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో జన్మించిన కృష్ణ 1954లో చెన్నై వెళ్లి అసిస్టెంట్ కాస్ట్యూమర్‌గా సినిమా రంగంలోకి ప్రవేశించారు. అతి తక్కువ కాలంలోనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పాటు వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవిలాంటి అగ్ర కథానాయికలను కూడా తన అత్యద్భుతమైన కాస్ట్యూమ్స్ డిజైనింగ్‌తో ప్రేక్షకులను మెప్పించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'భారత్ బంద్' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. 'పెళ్లాం చెబితే వినాలి', 'అల్లరి మొగుడు', 'దేవుళ్లు', 'మా ఆయన బంగారం', 'విలన్', 'పుట్టింటికి రా చెల్లి', 'పెళ్ళిపందిరి' వంటి తదితర సినిమాల్లో విలన్‌గా, తాతగా, తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా విభిన్నమైన పాత్రలను పోషించి అలరించారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డిక్షన్, హావభావాలు మెస్మరైజ్ చేసేవి. నటుడిగానే కాకుండా అభిరుచిగల నిర్మాతగానూ ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. 8 చిత్రాలను నిర్మించడంతోపాటు అప్పట్లో డిస్ట్రిబ్యూటర్‌గా నష్టాల్లో ఉన్న దిల్‌రాజుకు లిఫ్ట్ ఇచ్చిన నిర్మాతగానూ కాస్ట్యూమ్స్ కృష్ణకి మంచి పేరు దక్కింది. నిర్మాతగా, నటుడిగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గానే కాకుండా మంచి మనసున్న మనిషి కాస్ట్యూమ్స్ కృష్ణ మృతిపట్ల పలువురు పరిశ్రమ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.